Mohammad Sami: ఫాస్టెస్ట్‌ డెలివరీ రికార్డుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పాక్‌ మాజీ పేసర్‌

1 May, 2022 17:59 IST|Sakshi

Mohammad Sami: క్రికెట్‌ చరిత్రలో వేగవంతమైన బంతి ఎవరు వేశారన్న అంశంపై మాట్లాడుతూ పాక్‌ మాజీ పేసర్‌ మహ్మద్‌ సమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫాస్టెస్ట్‌ డెలివరీ రికార్డు అందరూ అనుకుంటున్నట్లుగా షోయబ్‌ అక్తర్‌ది కాదు.. తాను రెండు సందర్భాల్లో అంతకుమించిన వేగంతో బంతులు విసిరాను, అయితే అప్పట్లో మిషన్లు (స్పీడ్ గన్) పని చేయక ఆ క్రెడిట్‌ తనకు దక్కలేదని వాపోయాడు. పాకిస్థాన్‌లోని ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమీ మాట్లాడుతూ.. 

ఓ అంతర్జాతీయ మ్యాచ్‌లో తాను రెండు బంతుల్ని 160 కిమీ వేగానికిపైగా సంధించానని, అందులో ఒకటి 162 కిమీ, మరొకటి 164 కిమీ వేగంతో దూసుకెళ్లాయని, కానీ.. అప్పుడు స్పీడ్‌గన్‌ పనిచేయకపోవడంతో తాను సాధించిన ఘనత ప్రపంచానికి తెలియలేదని అన్నాడు. పాక్‌ తరఫున 36 టెస్టులు, 87 వన్డేలు, 13 టీ20లు ఆడిన సమీ 2003లో జింబాబ్వే జరిగిన ఓ మ్యాచ్‌లో  156.4 కిమీ స్పీడ్‌తో బౌలింగ్ చేశాడు. అదే అతడి అత్యుత్తమ బౌలింగ్ స్పీడ్ గా రికార్డై ఉంది. 

క్రికెట్‌ చరిత్రలో ఫాస్టెస్ట్‌ డెలివరీ రికార్డు 20 ఏళ్లుగా పాకిస్థాన్‌ స్పీడ్‌స్టర్‌ షోయబ్‌ అక్తర్‌ పేరిటే కొనసాగుతూ ఉంది. 2002లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్తర్‌ 161.3 కిమీ వేగంతో బంతిని సంధించాడు. అదే నేటికీ వేగవంతమైన బంతిగా చలామణి అవుతూ ఉంది. కాగా, సమీ భారత్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో 162.3 కిమీ వేగంతో బౌలింగ్ చేసినట్లున్న వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. 


ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యువ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ క్రమం తప్పకుండా 150 కిమీపైగా వేగంతో బంతులు సంధిస్తూ స్పీడ్‌ సెన్సేషన్‌గా మారాడు. ఈ కశ్మీరి కుర్రాడు మ్యాచ్‌ మ్యాచ్‌కు వేగాన్ని పెంచుకుంటూ పోవడంతో పాటు వికెట్లు కూడా సాధిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు. ఉమ్రాన్‌ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే ప్రస్తుత ఐపీఎల్‌  సీజన్‌లోనే అక్తర్ రికార్డు బద్ధలు కావడం ఖాయమని దిగ్గజాలు  అభిప్రాయపడుతున్నారు. 
చదవండి: 140 కి.మీ స్పీడుతో యార్కర్‌..దెబ్బకు బ్యాటర్‌కు ఫ్యూజ్‌లు ఔట్‌!

>
మరిన్ని వార్తలు