‘ఆరు యార్కర్లు వేయాల్సిందే’

20 Oct, 2020 05:51 IST|Sakshi

సూపర్‌ ఓవర్‌లో షమీ బౌలింగ్‌ వ్యూహం

దుబాయ్‌: రెండు సూపర్‌ ఓవర్ల తర్వాత ముంబై ఇండియన్స్‌పై పంజాబ్‌ విజయంలో పేసర్‌ మొహమ్మద్‌ షమీ కూడా కీలకపాత్ర పోషించాడు. తొలి సూపర్‌ ఓవర్‌ వేసిన అతను వరుస యార్కర్లతో రోహిత్, డికాక్‌లను ఇబ్బంది పెట్టడంతో కేవలం ఐదు పరుగులే వచ్చాయి. దాంతో ‘టై’ కావడంతో ఫలితం రెండో సూపర్‌ ఓవర్‌కు వెళ్లింది. తన బౌలింగ్‌ వ్యూహంపై షమీకి ముందే స్పష్టత ఉన్నట్లు కింగ్స్‌ ఎలెవన్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ వెల్లడించాడు. ‘సూపర్‌ ఓవర్‌ కోసం సాధారణంగా ఎవరూ సిద్ధంగా ఉండరు. అలాంటి సమయంలో బౌలర్‌ ధైర్యాన్ని, అతని నమ్మకాన్ని మనం నమ్మాలి. తాను ఆరు బంతులు కూడా యార్కర్లుగా వేసేందుకు షమీ సిద్ధంగా ఉన్నాడు. అతను చాలా అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. అతనిలాంటి సీనియర్లు మ్యాచ్‌లు గెలిపించడం ఎంతో అవసరం’ అని రాహుల్‌ అన్నాడు. టోర్నీలో సూపర్‌ ఓవర్‌లో ఒకసారి ఓడిన తాము ఈసారి మ్యాచ్‌ గెలవడం సంతోషమే అయినా... ఇది పునరావృతం కాకూడదని కోరుకుంటున్నట్లు అతను వ్యాఖ్యానించాడు.  

తీవ్ర నిరాశలో రోహిత్‌...
మరోవైపు ఈ పరాజయం ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మను తీవ్రంగా నిరాశపర్చింది. మ్యాచ్‌ తర్వాత ప్రసారకర్తలతో మాట్లాడేందుకు రాని రోహిత్, ఆ తర్వాత మీడియా సమావేశానికి కూడా పొలార్డ్‌ను పంపించాడు. ‘మేం గెలవాల్సిన మ్యాచ్‌ను ఓడిపోయామనే విషయాన్ని ఒప్పుకుంటాను. కానీ ఇదేమీ జీవితంలో అతి పెద్ద సమస్య కాదు. దీనిని మరచి ముందుకు సాగాలి. పరాజయం తర్వాత రోహిత్‌ బాగా బాధపడుతున్నాడని నాకు తెలిసింది. అయితే అతనో పోరాటయోధుడు అనే విషయం మరచిపోవద్దు’ అని కీరన్‌ పొలార్డ్‌ వెల్లడించాడు.  

నాకు కోపం తెప్పించింది: గేల్‌  
రెండో సూపర్‌ ఓవర్లో సిక్సర్‌తో చెలరేగి గెలిపించిన క్రిస్‌ గేల్‌ మాట్లాడుతూ...అసలు మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌ వరకు వెళ్లడమే తనకు నచ్చలేదని అన్నాడు. పంజాబ్‌ రెగ్యులర్‌ టైమ్‌లోనే మ్యాచ్‌ను గెలవాల్సిందని అభిప్రాయపడిన అతను, తాను ఒత్తిడికి లోను కాలేదని స్పష్టం చేశాడు. ‘సూపర్‌ ఓవర్లో ఆడే సమయంలో నేనేమీ ఒత్తిడికి లోను కాలేదు. అయితే అలాంటి స్థితికి మ్యాచ్‌ రావడమే నాకు ఆగ్రహం కలిగించింది. నిజానికి సూపర్‌ ఓవర్‌లో మొదటి బాల్‌ ఎవరు ఆడాలని మయాంక్‌ అడిగితే ఆశ్చర్యపోయా. ఎప్పుడైనా ‘బాస్‌’ ఆడాల్సిందేనని, తొలి బంతిని సిక్స్‌ కొడతాను చూడని కూడా అతనితో చెప్పా’ అని గేల్‌ వెల్లడించాడు.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు