IND Vs BAN: కోహ్లి సైగ చేశాడు.. సిరాజ్‌ అనుకరించాడు; ఒళ్లు మండినట్టుంది

15 Dec, 2022 16:28 IST|Sakshi

టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. తొలి టెస్టులో మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్న సిరాజ్‌ ఆరంభంలోనే బంగ్లాను దెబ్బతీశాడు. అయితే సిరాజ్‌ లిటన్‌దాస్‌ను పెవిలియన్‌ పంపించడానికి ముందు ఇద్దరి మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరిగింది.

టీ విరామం తర్వాత 14వ ఓవర్‌ సిరాజ్‌ వేశాడు. తొలి బంతిని గంటకు 140 కిమీవేగంతో విసరగా.. లిటన్‌దాస్‌ టచ్‌ చేయడంలో విఫలమయ్యాడు. దీంతో సిరాజ్‌ లిటన్‌ను ఏదో అన్నాడు. సిరాజ్‌ అన్నది అర్థంగాక అతని వెనకాల కొద్దిదూరం వచ్చి ''ఏంటి మళ్లీ చెప్పు..'' అంటూ తన చెవి దగ్గర చేయి పెట్టి సైగ చేశాడు.  లిటన్‌ చర్యతో సిరాజ్‌ చిర్రెత్తిపోయాడు.

ఆ తర్వాత బంతిని సిరాజ్‌ స్టంప్స్‌కు టార్గెట్‌ చేస్తూ విసిరాడు. లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో వచ్చిన బంతి లిటన్‌ బ్యాడ్‌ బాటమ్‌ ఎడ్జ్‌కు తాకి వికెట్లను గిరాటేసింది. అంతే లిటన్‌ పెవిలియన్‌ వెళ్తుండగా.. సిరాజ్‌ మొదట తన వేలుని మూతిపై ఉంచాడు. ఆ తర్వాత కోహ్లి చేసిన సైగ చూసిన సిరాజ్‌.. చెవి దగ్గరు చేతిని పెట్టి ఏంటి మళ్లీ చెప్పు అన్నట్లుగా లిటన్‌ దాస్‌వైపు చూశాడు. కానీ లిటన్‌ దాస్‌ ఏమీ అనలేక అక్కడినుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 404 పరుగులకు ఆలౌట్‌ అయింది. పుజారా 90 పరుగులతో టాప్‌ స్కోరర్‌ కాగా.. శ్రేయాస్‌ అయ్యర్‌ 86, అశ్విన్‌ 58 పరుగులు, కుల్దీప్‌ యాదవ్‌ 40 పరుగులతో​ రాణించారు. బంగ్లా బౌలర్లలో తైజుల్‌ ఇస్లామ్‌, మెహదీ హసన్‌లు చెరో నాలుగు వికెట్లు తీయగా.. ఎబాదత్‌ హొసెన్‌, ఖలీల్‌ అహ్మద్‌లు చెరొక వికెట్‌ తీశారు.

చదవండి: అశ్విన్‌ హాఫ్‌ సెంచరీ.. కేఎల్‌ రాహుల్‌ కంటే వెయ్యి రెట్లు బెటర్‌ అంటున్న ఫ్యాన్స్‌

మరిన్ని వార్తలు