ఆయన కల నెరవేరింది.. కానీ ఈరోజు బతికిలేరు

7 Jan, 2021 16:43 IST|Sakshi

సిడ్నీ : ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ కంటతడి పెట్టిన సంగతి తెలిసిందే. 26 ఏళ్ల సిరాజ్‌ కంటతడి వీడియో సోషల్‌ మీడియాలో కూడా వైరల్‌గా మారింది. కాగా సిరాజ్‌ కంటతడి పెట్టడానికి గల కారణాన్ని మ్యాచ్‌ అనంతరం వర్చువల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా  పంచుకున్నాడు.(చదవండి: 'తొందరపడ్డావు.. కొంచెం ఆగుంటే బాగుండేది')

'జాతీయగీతం ఆలపించే సమయంలో మా నాన్న గుర్తుకు వచ్చాడు.  ఆయన నన్ను ఒక క్రికెటర్‌గా చూడాలని ఎప్పుడూ అంటుంటేవాడు.. స్వతహగా మా నాన్నకు టెస్టు క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. దీంతో దేశం తరపున ఒక్క టెస్టు మ్యాచ్‌లో నేను ప్రాతినిధ్యం వహిస్తే చూడాలని ఉండేదని నాతో చాలాసార్లు అనేవాడు. ఆరోజు రానే వచ్చింది.. ఆసీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను.. కానీ నా ఆటను చూడడానికి మా నాన్న ఈరోజు బతికిలేడు. అందుకే అదంతా గుర్తుకువచ్చి కాస్త ఎమోషనల్‌ అవడంతో కన్నీళ్లు ఉబికి వచ్చాయంటూ' బాధగా చెప్పుకొచ్చాడు. (చదవండి : మహ్మద్‌ సిరాజ్‌ కంటతడి)

కాగా మెల్‌బోర్న్‌ టెస్టు ద్వారా అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసిన సిరాజ్‌ తొలి మ్యాచ్‌లోనే రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 5 వికెట్లు తీయడం ద్వారా ఆకట్టుకున్నాడు. అంతేగాక మెల్‌బోర్న్‌ టెస్టులో టీమిండియా విజయం సాధించడంతో సిరాజ్‌ తన తొలి టెస్టునే మధురానుభూతిగా మలుచుకోవడంలో సక్సెస్‌ అయ్యాడు. 

మరిన్ని వార్తలు