Mohammed Siraj: ఆ తొమ్మిది వికెట్లు నా తలరాతను మార్చాయి: సిరాజ్‌

2 Mar, 2022 15:41 IST|Sakshi

మహ్మద్‌ సిరాజ్‌.. ప్రస్తుతం టీమిండియా స్టార్‌ పేసర్‌గా ఎదుగుతున్నాడు. 2017లో టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన సిరాజ్‌ మొదట్లో జట్టులోకి వస్తూ.. పోతూ ఉండేవాడు. గత ఏడాది కాలంగా అన్ని ఫార్మాట్లలోనే రెగ్యులర్‌ ప్లేయర్‌గా కొనసాగుతూ కీలకంగా మారుతున్నాడు. ఇక ఐపీఎల్‌లో సిరాజ్‌.. ఆర్‌సీబీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కోహ్లి, మ్యాక్స్‌వెల్‌ను రిటైన్‌ చేసుకున్న ఆర్‌సీబీ సిరాజ్‌పై ఉన్న నమ్మకంతో తమ వద్దే అట్టిపెట్టుకుంది. మార్చి 26 నుంచి ఐపీఎల్‌ 2022 సీజన్‌ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో సిరాజ్‌ ఆర్‌సీబీ పాడ్‌కాస్ట్‌కు చిన్న ఇంటర్య్వూ ఇచ్చాడు. క్రికెట్‌లో తన అడుగు ఎలా పడిందనేది మహ్మద్‌ సిరాజ్‌ ఆసక్తికరంగా వివరించాడు. 

చదవండి: Mohammed Siraj: 'క్రికెట్‌ వదిలేయ్‌.. మీ నాన్నతో వెళ్లి ఆటో తోలుకో'

''నా కెరీర్‌ విషయమై అమ్మ, నాన్న ఎప్పుడు గొడవపడుతుండేవారు. నేను జాబ్‌ చేయాలా లేక చదువుకోవాలా అనే దానిపై రోజు పెద్ద చర్చ నడిచేది. కానీ నాకు ధ్యాసంతా క్రికెట్‌పైనే.. చదవడం, జాబ్‌ చేయడం ఇష్టం లేదు. ఈ విషయం అమ్మానాన్నకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఆ సమయంలో మా మామయ్య నాకు సహకరించాడు. ఒకరోజు గొడవ జరుగుతున్న సందర్భంలో మామయ్య ఇంటికి వచ్చాడు. 

అతనికి ఒక క్రికెట్‌ క్లబ్‌ ఉంది. మావాళ్లు చెప్పిందంతా విన్న మామయ్య.. వాడిని(సిరాజ్‌) క్లబ్‌కు తీసుకెళుతాను. అక్కడికి వచ్చి సిరాజ్‌ క్రికెట్‌ ఆడతాడు.. ఆ తర్వాత ఏం చేయాలో డిసైడ్‌ చేద్దాం అన్నాడు. నేను సరే అని ఒప్పుకున్నా. ఆడిన తొలి మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లు తీశా. నా ప్రదర్శన చూసిన మామయ్య ఆశ్చర్యపోయి.. ఇంత బాగా ఆడతావని ఊహించలేదన్నాడు. వెంటనే నాన్నకు ఫోన్‌ చేసి.. వాడిని చదవమని.. జాబ్‌ చేయమని బలవంతం చేయొద్దు.. నచ్చింది చేయనివ్వండి. సిరాజ్‌కు అండగా నేనుంటా.. ఖర్చులన్నీ భరిస్తా అని చెప్పి ఐదు వందలు రూపాయలు నా చేతిలో పెట్టాడు. 

బహుశా అదే నా తొలి సంపాదన అనుకుంటా. అందులో మూడు వందలు నా కుటుంబానికి ఇచ్చి.. మిగతా రెండు వందల రూపాయాలు నా దగ్గరే పెట్టుకున్నా. ఒక రకంగా నేను క్రికెట్‌లో అడుగుపెట్టడానికి మామయ్య పరోక్షంగా కారణం అయితే.. ప్రత్యక్షంగా ఆ 9 వికెట్లు ఉంటాయి. నిజానికి ఆ తొమ్మిది వికెట్లు నా తలరాతను మార్చాయి.. లేకుంటే ఈరోజు ప్రపంచస్థాయి బౌలర్‌ను మీరు చూసి ఉండరు'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక సిరాజ్‌ టీమిండియా తరపున 4 టెస్టులు, 2 వన్డేలు, 12 టి20 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్‌లో 50 మ్యాచ్‌ల్లో 50 వికెట్లు తీశాడు.

చదవండి: Ravichandran Ashwin: 'సోయి లేకుండా మాట్లాడొద్దు'.. జర్నలిస్ట్‌ను ఉతికారేసిన అశ్విన్‌

Womens World Cup 2022: టాయిలెట్‌లో చిక్కుకుపోయిన మహిళా క్రికెటర్‌.. మ్యాచ్‌ కోసం

మరిన్ని వార్తలు