ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా తండ్రి సమాధి వద్దకు సిరాజ్‌

21 Jan, 2021 16:23 IST|Sakshi

హైదరాబాద్‌: ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన హైదరాబాదీ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు ఆత్మీయ స్వాగతం లభించింది. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అభిమానులు అతడిని చుట్టుముట్టారు. ఇక హైదరాబాద్‌కు చేరుకోగానే సిరాజ్‌ తొలుత తన తండ్రి మహ్మద్‌ గౌస్‌ సమాధిని సందర్శించాడు. తాను ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఉన్న తండ్రి శ్రమను గుర్తుచేసుకుంటూ ఆయనకు నివాళులు అర్పించాడు. కాగా సిరాజ్‌ తండ్రి ఆటోడ్రైవర్‌గా పనిచేసేవారు‌. కొడుకును టీమిండియా క్రికెటర్‌గా చూడాలనే కోరికతో అనేక కష్టనష్టాలకోర్చారు. 2019లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో వన్డేల్లో అరంగేట్రం చేసిన సిరాజ్‌ను చూసి ఎంతో మురిసిపోయారు.(చదవండి: ఆసీస్‌ టూర్‌: అరంగేట్రంలోనే అదరగొట్టేశారు!)

అయితే, నవంబరులో మొదలైన టీమిండియా ఆసీస్‌ పర్యటనకు ఎంపికైన సిరాజ్‌ అక్కడికి చేరుకున్న కొన్ని రోజులకే, మహ్మద్‌ గౌస్‌ అనారోగ్య కారణాలతో మరణించిన విషయం విదితమే. ఈ క్రమంలో స్వదేశానికి వెళ్లేందుకు బీసీసీఐ సిరాజ్‌కు అనుమతి ఇచ్చినా, సంప్రదాయ క్రికెట్‌లో తన అరంగేట్రం కోసం కలలు గన్న తండ్రి ఆశయాన్ని నెరవేర్చేందుకు అక్కడే ఉండిపోయాడు. ఇక బాక్సింగ్‌ డే టెస్టు ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ హైదరాబాదీ.. సీనియర్ల గైర్హాజరీలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అద్భుతంగా రాణించాడు. టెస్టు సిరీస్‌లో 13 వికెట్లు తీసి సత్తా చాటాడు. గబ్బాలో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించి క్రికెట్‌ దిగ్గజాల ప్రశంసలు అందుకున్నాడు. (చదవండి: ఆ ముగ్గురు ఇండియాను గెలిపించారు)

A post shared by Viral Bhayani (@viralbhayani)

>
మరిన్ని వార్తలు