Mohsin Khan: ‘4 నెలల సమయం ఇస్తే.. అతడిని ఇండియా బెస్ట్‌ ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దుతా’

11 Jun, 2022 13:08 IST|Sakshi
మొహసిన్‌ ఖాన్‌(PC: IPL)- మహ్మద్‌ షమీ

IPL 2022: ఐపీఎల్‌-2022 సీజన్‌లో పొదుపైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువ క్రికెటర్‌ మొహసిన్‌ ఖాన్‌. కొత్త ఫ్రాంఛైజీ లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అతడు 6 కంటే తక్కువ ఎకానమీ (5.96)తో రెండో స్థానంలో కేవలం 14.07 సగటుతో 14 వికెట్లు పడగొట్టాడు. మొహసిన్‌ సత్తా ఏమిటో అర్థం చేసుకోవడానికి ఈ గణాంకాలు చాలు.

ఇలా అవకాశం వచ్చిన ఆరంభ సీజన్‌లోనే తానేంటో నిరూపించుకుని పలువురి దృష్టిని ఆకర్షించాడు. ఈ జాబితాలో టీమిండియా సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ కూడా ఉన్నాడు. మొహసిన్‌ ప్రతిభకు షమీ ఫిదా అయినట్లు అతడి కోచ్‌ బరుద్దీన్‌ సిద్ధిఖి పేర్కొన్నాడు.

ఐపీఎల్‌ మెగా వేలం-2022 నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ.. ‘‘వేలం జరుగుతున్న సమయంలో నేను షమీతో పాటే అతడి ఫామ్‌హౌజ్‌లో ఉన్నాను. షమీ సెలక్ట్‌ అయినట్లు తెలిసింది. అలాగే మొహసిన్‌ను కూడా లక్నో కొనుగోలు చేసింది. 

ఈ విషయం తెలియగానే.. ‘‘నాకొక నాలుగు నెలల సమయం ఇవ్వండి. మొహసిన్‌ను ఇండియాలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దుతా. నిజానికి తను చాలా మంచి బ్యాటర్‌. పరిస్థితులను అర్థం చేసుకుని అందుకు తగ్గట్లు ఆడతాడని కేఎల్‌ రాహుల్‌ సైతం నాతో అన్నాడు’’ అని షమీ నాతో చెప్పాడు’’ అని సిద్ధిఖి స్పోర్ట్స్ యారీతో వ్యాఖ్యానించాడు.

యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంలో షమీ ఎల్లప్పుడూ ముందుంటాడని ప్రశంసించాడు. కాగా సిద్ధిఖి గతంలో షమీతో కలిసి పనిచేశాడు. ఇక లెఫ్ట్‌ హ్యాండెడ్‌ బ్యాటర్‌ అయిన మొహసిన్‌కు ఎప్పుడు పెద్దగా బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. 2018 సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో అదరగొట్టిన 2019లో ముంబై ఇండియన్స్‌ కొనుగోలు చేసింది.

అయితే, ఆడే అవకాశం మాత్రం రాలేదు. మెగా వేలం 2022లో ఈ లెఫ్టార్మ్‌ బౌలర్‌ను లక్నో 20 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. ఆరంభ మ్యాచ్‌లలో అవకాశం ఇవ్వకపోయినా కొన్ని కీలక మ్యాచ్‌లలో అదరగొట్టి 23 ఏళ్ల మొహసిన్‌ ఖాన్‌ అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకొన్నాడు. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టడం విశేషం. ఇదిలా ఉంటే.. గుజరాత్‌ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన షమీ.. జట్టును చాంపియన్‌గా నిలపడంలో తన వంతు పాత్ర పోషించాడు.

చదవండి: Hardik Pandya: ఎన్నెన్ని మాటలు అన్నారో.. అదో పెద్ద యుద్ధం.. ఎన్ని త్యాగాలు చేశానో ఎవరికీ తెలియదు!
ENG vs NZ: డారిల్ మిచెల్ భారీ సిక్సర్.. అభిమాని బీర్‌ గ్లాస్‌లో పడ్డ బంతి.. వీడియో వైరల్‌!

మరిన్ని వార్తలు