మోహన్‌ బగాన్‌కు అరుదైన గౌరవం

30 Jul, 2020 02:43 IST|Sakshi

టైమ్స్‌ స్క్వేర్‌లోని నాస్‌డాక్‌ బిల్‌బోర్డులపై జట్టు లోగో ప్రదర్శితం

కోల్‌కతా: క్రికెట్‌ అంటే పడిచచ్చే భారత్‌లో ఇప్పటికీ ఫుట్‌బాల్‌ను బతికిస్తున్న జట్లలో ప్రతిష్టాత్మక మోహన్‌ బగాన్‌ క్లబ్‌ ఒకటి. 131 ఏళ్ల చరిత్ర గల ఈ క్లబ్‌కు బుధవారం అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్‌లోని ప్రతిష్టాత్మక టైమ్స్‌ స్క్వేర్‌లో ‘నాస్‌డాక్‌’ బిల్‌బోర్డులపై క్లబ్‌ లోగోను, టీమ్‌ రంగులను ప్రత్యేకంగా ప్రదర్శించారు.

భారత్‌ నుంచి ఏ క్రీడలకు సంబంధించిన జట్టు గురించైనా ఇలా ‘నాస్‌డాక్‌’ బిల్‌బోర్డుపై ప్రదర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం. జులై 29ని ‘మోహన్‌ బగాన్‌ డే’గా వ్యవహరిస్తారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని టైమ్స్‌ స్క్వేర్‌లో ఈ ఏర్పాటు చేశారు. 1911లో ఇదే రోజు ప్రతిష్టాత్మక ఐఎఫ్‌ఏ షీల్డ్‌ టోర్నీలో భాగంగా మోహన్‌ బగాన్‌ 2–1తో బ్రిటిష్‌కు చెందిన ఈస్ట్‌ యార్క్‌షైర్‌ రెజిమెంట్‌ జట్టును ఓడించింది. భారత స్వాతంత్రోద్యమ కాలంలో దక్కిన ఈ గెలుపునకు అప్పట్లో ఎంతో ప్రాధాన్యత లభించింది.

తమ జట్టుకు తాజాగా దక్కిన గౌరవంపట్ల మోహన్‌ బగాన్‌ యాజమాన్యం ఎంతో సంతోషం వ్యక్తం చేసింది. తమ జట్టు ఎంతో ప్రత్యేకమైందో ఇది చూపించిందని అభిమానులు ఆనందం ప్రదర్శించారు. మరోవైపు ప్రపంచ ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఫిఫా) కూడా దీనిపై అభినందనలు తెలపడం విశేషం. ‘న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌లో బిల్‌బోర్డుపై కనిపించిందంటే అది ఒక క్లబ్‌ మాత్రమే కాదు. ఈ ప్రపంచంలో ఫుట్‌బాల్‌కు అమితంగా మద్దతిచ్చే క్లబ్‌లలో ఒకటైన మోహన్‌ బగాన్‌ను అభినందనలు’ అని ‘ఫిఫా’ ట్వీట్‌ చేసింది.

మరిన్ని వార్తలు