ఎవరీ కుర్రాడు.. రేపటి టెస్టు మ్యాచ్‌లో ఆడిద్దామా!

25 May, 2021 17:32 IST|Sakshi

జోహన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా మాజీ బౌలర్‌ మోర్నీ మోర్కెల్‌ ఆ దేశం నుంచి విజయవంతమైన ఫాస్ట్‌ బౌలర్లలో ఒకడు. మంచి పొడగరి అయిన మోర్కెల్‌ పదునైన బౌన్సర్లతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లను ఇబ్బందులకు గురి చేసేవాడు. 2006-2018 మధ్య దక్షిణాఫ్రికా తరపున ఆడిన మోర్కెల్‌ తన 12 ఏళ్ల కెరీర్‌లో 86 టెస్టుల్లో 309 వికెట్లు,117 వన్డేల్లో 188 వికెట్లు, 44 టీ20ల్లో 47 వికెట్లు తీశాడు. మొత్తంగా దక్షిణాఫ్రికా తరపున 500కు పైగా వికెట్లు తీసిన ఆరో ఆటగాడిగా నిలిచాడు. మోర్నీ మోర్కెల్‌ సోదరుడు అల్బీ మోర్కెల్‌ కూడా దక్షిణాఫ్రికా తరపున ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.

తాజాగా మోర్కెల్‌ 2004లో ఈస్ట్రెన్స్‌ తరపున ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లో ఎలా అరంగేట్రం చేశాననేది చెప్పుకొచ్చాడు. '' 2004లో వెస్టిండీస్‌ దక్షిణాఫ్రికాలో పర్యటించేందుకు వచ్చింది. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో భాగంగా ఈస్ట్రెన్స్‌తో వారు ఆడాల్సి ఉంది. దీనిలో భాగంగా నా సోదరుడు అల్బీ మోర్కెల్‌ నా వద్దకు వచ్చి ఈస్ట్రన్స్‌కు ఒక నెట్‌ బౌలర్‌ కావాలి.. నువ్వెందుకు ప్రయత్నించకూడదు అని చెప్పాడు. అలా ఈస్ట్రన్స్‌ బ్యాట్స్‌మెన్‌కు నెట్‌బౌలర్‌గా బంతులు విసిరాను. నా బౌలింగ్‌ చూసిన కోచ్‌ నా వద్దకు వచ్చి.. '' నీ బౌలింగ్‌ బాగుంది.. ఏం చేద్దామనుకుంటున్నావు'' అని అడిగాడు.. అతను అడిగింది నాకు అర్థం కాలేదు.. ''ఏమో తెలీదు'' అని సమాధానం ఇచ్చాను. వెంటనే కోచ్‌ నన్ను ఆఫీస్‌ రూమ్‌కు తీసుకెళ్లి జూనియర్‌ క్రికెటర్‌గా కాంట్రాక్ట్‌ ఇప్పించాడు. అలా ఈస్ట్రన్స్‌ తరపున ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌ను ప్రారంభించాను.

కొంతకాలం తర్వాత ఇంగ్లండ్‌ దక్షిణాఫ్రికాలో పర్యటించింది. కాగా ప్రాక్టీస్‌ సమయంలో నేను అప్పటి ఆల్‌రౌండర్‌ జాక్‌ కలిస్‌కు బంతులు విసిరాను. అతను నా బౌలింగ్‌ చూసి ఇంప్రెస్‌ అయ్యాడు. కోచ్‌ జెన్నింగ్స్‌ వద్దకు వెళ్లి.. ''ఎవరీ కుర్రాడు అద్బుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడు..'' అని అడిగాడు. దానికి కోచ్‌.. ''అతను అల్బీ మోర్కెల్‌ తమ్ముడు మోర్నీ మోర్కెల్‌.. ఈస్ట్రన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇది విన్న కలిస్‌.. ఇతన్ని మనం రేపటి టెస్టు మ్యాచ్‌లో ఆడేందుకు అవకాశం ఇస్తే బాగుంటుందని'' చెప్పాడు. అని వివరించాడు. అలా 2006లో టీమిండియాతో జరిగిన బాక్సింగ్‌ డే టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన మోర్కెల్‌ 12 ఏళ్ల పాటు ప్రొటీస్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
చదవండి: 'ఆ సమయంలో ద్రవిడ్‌ను చూసి భయపడేవాళ్లం'

మరిన్ని వార్తలు