Krishnappa Gowtham: 9.25 కోట్లు వెచ్చించారు.. కానీ, ఒక్క మ్యాచ్‌ కూడా ఆడించలేదు..!

9 Feb, 2022 19:53 IST|Sakshi

IPL 2022 Auction: ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన భారత అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కిన కర్ణాటక ఆల్‌రౌండర్‌ కృష్ణప్ప గౌతమ్‌.. త్వరలో జరగనున్న 15వ ఐపీఎల్‌ మెగా వేలంలోనూ భారీ ధరను ఆశిస్తున్నాడు. గతేడాది కృష్ణప్ప గౌతమ్‌ను ఏకంగా రూ.9.25 కోట్లకు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన చెన్నై సూపర్ కింగ్స్..ఈ ఏడాది ఆటగాళ్ల రిటెన్షన్‌లో భాగంగా అతన్ని వదులుకుంది. గత సీజన్‌ వేలంలో కృష్ణప్ప కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్‌లు తీవ్రంగా పోటీపడినప్పటికీ చివరికి సీఎస్‌కే అతన్ని సొంతం చేసుకుంది. 

అయితే, ఇక్కడ ఓ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అన్ని కోట్లు వెచ్చించి, ప్రత్యర్ధి జట్లతో పోటీపడి మరీ చేజిక్కించుకున్న ఆటగాడిని సీఎస్‌కే ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌ కూడా ఆడించలేదు. అయినప్పటికీ, కృష్ణప్పకు లక్కీగా శ్రీలంకపై వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం దక్కింది. ఆ మ్యాచ్‌లో అతను ఓ వికెట్‌, 2 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో తదనంతర పరిణామాల్లో అతను కనుమరుగయ్యాడు. తాజాగా ఐపీఎల్‌ మెగా వేలం దగ్గర పడడటంతో అతని పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. కుడి చేతి వాటం స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అయిన కృష్ణప్ప గౌతమ్.. తన ఐపీఎల్‌ కెరీర్‌లో 24 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు, 186 పరుగులు సాధించాడు.  

ఇదిలా ఉంటే, గతేడాది ఐపీఎల్‌ వేలంలో అత్యంత ఖరీదైన ఐదుగురు ఆటగాళ్లలో కృష్ణప్ప గౌతమ్ ఒకడు. రాజస్థాన్‌ రాయల్స్‌ క్రిస్ మోరిస్‌పై 16 కోట్లు వెచ్చించగా, కివీస్ ఆల్ రౌండర్ కైల్ జేమీసన్‌పై ఆర్సీబీ 15 కోట్లు, జే రిచర్డ్‌సన్‌పై పంజాబ్‌ 14 కోట్లు, గ్లెన్ మాక్స్‌వెల్‌పై ఆర్సీబీ 14.2 కోట్లు వెచ్చించాయి. వీరి తర్వాత అత్యంత భారీ ధర పలికిన అనామక క్రికెటర్‌ కృష్ణప్ప గౌతమ్ కావడం విశేషం. 
చదవండి: IND VS WI 2nd ODI: సూర్యకుమార్‌ యాదవ్‌ ప్రపంచ రికార్డు.. వన్డే క్రికెట్‌ చరిత్రలో ఒకే ఒక్కడు

మరిన్ని వార్తలు