Ranji Trophy 2022: 'కెప్టెన్‌ పెళ్లికి రెండు రోజుల సెలవు మాత్రమే ఇచ్చాను'

27 Jun, 2022 08:30 IST|Sakshi

రంజీ ట్రోఫీ 2021-22 సీజన్‌ విజేతగా అవతరించి తొలి టైటిల్‌ గెలిచింది మధ్యప్రదేశ్‌. బెంగళూరు వేదికగా ముంబైతో జరిగిన ఫైన్లలో మధ్యప్రదేశ్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి తొలిసారి రంజీ ఛాంపియన్‌గా అవతరించింది. ఈ గెలుపులో హెడ్‌కోచ్‌ చంద్రకాంత్ పండిట్ కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన చంద్రకాంత్.. తమ కెప్టెన్‌ ఆదిత్య శ్రీవాస్తవపై ప్రశంసల వర్షం కురిపించాడు. శ్రీవాస్తవ అద్భుతమైన కెప్టెన్‌ అని అతడు కొనియాడాడు.

శ్రీవాస్తవ వివాహానికి కేవలం రెండు రోజులు సెలవు మాత్రమే మంజూరు చేసినట్లు చంద్రకాంత్ తెలిపాడు. ‘‘గతేడాది శ్రీవాస్తవ వివాహం జరిగింది. ఏ ట్రోఫీ గెలిచినా సంతృప్తిని ఇస్తుంది. కానీ రంజీట్రోఫీ విజయం చాలా ప్రత్యేకమైనది.  23 ఏళ్ల క్రితం​ మధ్యపదేశ్‌ కెప్టెన్‌గా నేను ఇది సాధించలేకపోయాను. నేను ఇన్నాళ్లూ ఏదో కోల్పోయాను అనే బాధలో ఉన్నాను.

ఇప్పుడు నా కల నేరవేరడంతో కాస్త ఉద్వేగానికి లోనయ్యాను. అత్యుత్తమ స్థాయికి చేరుకోవాలంటే మనం కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. గత ఏడాది శ్రీవాస్తవ పెళ్లి చేసుకోబోతున్నప్పుడు, నా దగ్గరకు వచ్చి అనుమతి అడిగాడు. అయితే తన పెళ్లికి కేవలం రెండు రోజుల సెలవు మాత్రమే ఇచ్చాను. ఇది ఒక మిషన్‌ వంటింది. రోజుకి చాలా గంటల తరబడి కష్టపడాల్సి ఉంటుంది అని మా ఆటగాళ్లకు చెప్పాను. వారు కూడా చాలా కష్టపడి నా కలను నిజం చేశారు" అని చంద్రకాంత్ పండిట్ పేర్కొన్నాడు.
చదవండి: ENG vs NZ: న్యూజిలాండ్‌తో మూడో టెస్టు.. విజయం దిశగా ఇంగ్లండ్..!

మరిన్ని వార్తలు