ధోని ఒక్కడ్నే బాధ్యుడ్ని చేస్తారా?

9 Oct, 2020 16:33 IST|Sakshi

దుబాయ్‌:  ఈ ఐపీఎల్‌ సీజన్‌లో భాగంగా బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌ 20 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌట్‌ కాగా, సీఎస్‌కే 20 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. పరుగులు తీయాల్సిన సమయంలో కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని, బ్యాట్స్‌మెన్‌ కేదార్‌ జాదవ్‌ 24 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యారు. దీంతో వీరిద్దరి వల్లే గెలిచే మ్యాచ్‌ చేజారిపోయిందంటూ సీఎస్‌కే ఫ్యాన్స్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్రోలింగ్‌కు దిగారు.  ప్రధానంగా ధోని వైఫల్యాన్ని టార్గెట్‌ చేస్తూ విమర్శలు చేశారు. (చదవండి:సీఎస్‌కే బ్యాట్స్‌మెన్‌ ప్రభుత్వ ఉద్యోగులా?!)

కాగా, ధోనికి మద్దతుగా నిలిచాడు మాజీ స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా. ఓ స్పోర్ట్స్‌ చానెల్‌తో ఓజా మాట్లాడుతూ.. ‘ ధోని ఒక్కడ్నే బాధ్యుడ్ని చేస్తారా..వరుసగా సీఎస్‌కే వరుస పరాజయాలకు ధోని కారణమా. ఐపీఎల్‌ ఆరంభమైన తర్వాత సీఎస్‌కే క్యాంపులో ఏమి జరుగుతుంతో చూడటం లేదా. ఓవరాల్‌గా ఆ జట్టు ప్రదర్శన బాగాలేదు. ఇది ఫ్యాన్స్‌కు మింగుడు పడటం లేదు. ఇక వెంటనే ధోని వైపు వేలెత్తి చూపుతున్నారు. జట్టు మొత్తంగా విఫలమైతే ధోని ఒక్కడే ఏం చేస్తాడు. సమిష్టి వైఫల్యానికి వ్యక్తిగత దూషణలకు దిగడం భావ్యం కాదు. ఇక్కడ ధోనిని విమర్శించలేం. కేదార్‌ జాదవ్‌ ఉన్నాడు.. ఏమైనా స్కోరు చేశాడా.. అతని నుంచి సీఎస్‌కే ఏమి ఆశిస్తుందో అది ఇంతవరకూ ఇవ్వలేదు. ధోని బ్యాటింగ్‌ ఆర్డర్‌పై కూడా మాట్లాడుతున్నారు. బ్యాటింగ్‌ గ్యాప్‌ను సర్దుబాటు చేసేందుకే ధోని యత్నిస్తున్నాడు. సీఎస్‌కేలో రెండు పెద్ద గ్యాప్‌లు ఉన్నాయి. ఒకటి సురేశ్‌ రైనా జట్టును వీడి వెళ్లిపోవడం, ఇంకొటి జాదవ్‌ సరిగా ఆడకపోవడం. వీటిని ఫిల్‌ చేయడం చాలా కష్టం. ధోని ఏమి చేసినా కామెంట్లు చేయడం ఆపితే మంచిది. ఎప్పుడైనా ఏ ఒక్కడో పరాజయాలకు కారణం కాదు. జట్టుగా ఆడుతున్నప్పుడు ఓవరాల్‌ జట్టు విఫలమైతే అందుకు మూల్యం చెల్లించుకుంటుంది. ఇప్పుడు సీఎస్‌కే యూనిట్‌లో అదే పరిస్థితి ఉంది’ అని ఓజా పేర్కొన్నాడు.(చదవండి: ఆ విషయాన్ని పంత్‌ గ్రహించాడు: లారా)

మరిన్ని వార్తలు