ధోని మోకాలి ఆపరేషన్‌ సక్సెస్‌

1 Jun, 2023 19:34 IST|Sakshi

చెన్నై సూపర్ కింగ్స్ సారధి మహేంద్ర సింగ్‌ ధోని మోకాలికి ఇవాళ (జూన్‌ 1) జరిగిన శస్త్ర చికిత్స విజయవంతమైందని సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథ్‌ వెల్లడించారు. ముంబైలోని కోకిలాబెన్‌ ఆసుపత్రిలో నేటి ఉదయం ధోనికి సర్జరీ జరిగిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ధోని ఫిట్‌గా ఉన్నాడని, మరో రెండు రోజుల పాటు అతను ఆసుపత్రిలోనే ఉంటాడని పేర్కొన్నారు.

సర్జరీ అనంతరం తాను ధోనితో మాట్లాడానని.. శస్త్రచికిత్స గురించి వివరించలేను కానీ అది కీ-హోల్ ఆపరేషన్‌ అని మాత్రం చెప్పగలనని వివరించారు. మొత్తంగా ధోనికి జరిగిన ఆపరేషన్‌ సక్సెస్‌ అయ్యిందని తెలిపారు.

కాగా, ఇటీవల ముగిసిన ఐపీఎల్‌-2023లో మహీ మోకాలి సమస్యతో బాధపడిన విషయం తెలిసిందే. సీఎస్‌కే టైటిల్‌ గెలిచిన 48 గంటల్లోనే ధోని ఆసుపత్రిలో చేరాడు. తాజాగా శస్త్ర చికిత్స సైతం విజయవంతంగా పూర్తి చేసుకుని మరో రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్‌ కానున్నాడు. గతంలో టీమిండియా యువ వికెట్‌కీపర్‌ రిషబ్ పంత్‌కు ఆపరేషన్ చేసిన స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ దిన్షా పార్దివాలానే ధోని సైతం (41) సర్జరీ చేశారు. ఆసుపత్రిలో ధోనితో పాటు అతని భార్య సాక్షి ఉన్నారు.

ఇదిలా ఉంటే, గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన ఐపీఎల్‌ 2023 ఫైనల్స్‌లో ధోని సేన 5 వికెట్ల తేడాతో విజయం సాధించి, ఐదో ఐపీఎల్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌.. సాహా (54), సాయి సుదర్శన్‌ (96) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేయగా.. ఛేదనలో సీఎస్‌కే 15 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసి డక్‌ వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో విజయం సాధించింది. రుతురాజ్‌ (26), కాన్వే (47), శివమ్‌ దూబే (32 నాటౌట్‌), రహానే (27), రాయుడు (19), జడేజా (15 నాటౌట్‌) తలో చేయి వేసి సీఎస్‌కేను గెలిపించారు. 

చదవండి: ప్రపంచంలోకెల్లా సంపన్నమైన క్రికెట్‌ బోర్డు.. జెర్సీ స్పాన్సర్‌ చేసే నాథుడే లేడా..?

మరిన్ని వార్తలు