ఎక్కడైనా ధోనియే నెంబర్‌ వన్‌

14 Aug, 2020 09:18 IST|Sakshi

ముంబై : టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనికి క్రేజ్‌ ఎలా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ధోని మైదానంలోకి దిగి దాదాపు సంవత్సరం అవుతుంది. గతేడాది 2019 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌ ధోని ఆడిన చివరి మ్యాచ్‌..  ఆ తర్వాత మళ్లీ జట్టులో కనిపించలేదు. సెప్టెంబర్‌ 19 నుంచి దుబాయ్‌ వేదికగా ఐపీఎల్‌ షురూ కావడంతో మళ్లీ అందరి కళ్లు ధోని మీదకు మళ్లాయి. ఆటకు దూరంగా ఉన్నా.. అతని పాపులారిటీ మాత్రం ఇసుమంతైనా తగ్గలేదనడానికి ఈ వార్త ఉదాహరణ.(ఈసారి హెలికాప్టర్‌ షాట్లతో పాపులర్‌..!)

ఓర్మాక్స్‌ మీడియా సంస్థ భారత్‌లో అత్యధిక ప్రజాదరణ కలిగిన 10 మంది ఆటగాళ్ల జాబితాను గురువారం విడుదల చేసింది. ఈ విషయాన్ని తన ట్విటర్‌లో ప్రకటించింది. అందులో టీమిండియాకు చెందిన ఏడుగురు భారత క్రికెటర్లు చోటు సంపాదించారు. అందులో ముగ్గురు ఆటగాళ్లు రిటైర్మంట్‌ ప్రకటించగా.. మిగతా నలుగురు జట్టులో కొనసాగుతున్నారు. మిగతావారిలో ఫుట్‌బాల్‌ స్టార్‌ ఆటగాళ్లు లియోనల్‌ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డొ, టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా ఉన్నారు.(‘నా పేస్‌ దెబ్బకు కోహ్లినే బిత్తర పోయాడు’)


ఇక జాబితాలో ఎంఎస్‌ ధోని అగ్రస్థానంలో ఉండగా.. ప్రస్తుత టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి రెండవ స్థానం, భారత దిగ్గజం.. క్రికెట్‌ దేవుడు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ మూడవ స్థానంలో, హిట్‌మ్యాన్‌ రోహిత్‌.. 4, రొనాల్డొ..5, సానియా మీర్జా.. 6, మెస్సీ..7, యువరాజ్‌ సింగ్‌..8, సౌరవ్‌ గంగూలీ..9, చివరిగా ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా జాబితాలో 10వ స్థానం సంపాదించాడు. జాబితాలో ధోని నెంబర్‌ వన్‌ స్థానంలో ఉండడంపై అతని అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఆట ఆడినా.. ఆడకపోయినా.. ఎక్కడైనా ధోనియే నెంబర్‌ వన్‌గా ఉంటాడంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు