మీకు సలాం, ట్రెండింగ్‌లో థాంక్యూ మహి!

16 Aug, 2020 11:03 IST|Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోని అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి అనూహ్యంగా వైదొలడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మరికొన్నాళ్లు కొనసాగాలని, నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కొందరు వేడుకుంటున్నారు. భారత క్రికెట్‌లో ఓ శకం ముగిసిందని, ధోని టీమిండియాను అత్యున్నత శిఖరాలకు చేర్చాడని మరికొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. అతని సేవలకు గాను అభిమానులు, సహచర ఆటగాళ్లు #ThankYouMahi, #ThankYouDhoni అనే హ్యాష్‌టాగ్‌తో అభిమానాన్ని చాటుకుంటున్నారు. దీంతో ఈ హ్యాష్‌టాగ్‌లు ట్రెండింగ్‌లో కొనసాగుతున్నాయి. అయితే, ధోనితో పాటే సురేష్‌ రైనా కూడా ఇంటర్నేషనల్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం బాధగా ఉందని ఓ అభిమాని చెప్పుకొచ్చాడు. వారిద్దరి ఆటను ఆస్వాదించేందుకే క్రికెట్‌ చూస్తానని, ఇక నుంచి క్రికెట్‌ చూడబోనని వెల్లడించాడు. ఐపీఎల్‌లో ఇక చెన్నై సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌లు మాత్రమే వీక్షిస్తానని పేర్కొన్నాడు.
(ఇక క్రికెట్ ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు: మ‌హేశ్‌)

కట్టకట్టుకుని ధోని, రైనా ఒకేసారి ఆటకు స్వస్తి చెప్పడంతో గుండె పగిలినట్టయిందని బీజేపీ యువజన మోర్చాకు చెందిన శివలిక అంబానీ వాపోయారు. వారిద్దరు గొప్ప గొప్ప భాగస్వామ్యాలు నెలకొల్పి టీమిడింయాను విజయతీరాలకు చేర్చానని గుర్తు చేశారు. ధోని లాంటి కెప్టెన్‌ టీమిండియాకు ఎప్పటికీ దొరకడని మరో అభిమాని పేర్కొన్నారు. ఎప్పటికీ అభిమానులు గుండెల్లో నువ్‌ హీరోనే అంటూ మరో నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు. ఆట నుంచి రిటైర్‌ అయినా మా గుండెల్లో చిరకాలం ఉంటావని ఇంకో అభిమాని ప్రేమని చాటుకున్నారు. 33 ఏళ్ల రైనా కూడా ఆటకు గుడ్‌బై చెప్పడం ఆశ్చర్యంగా ఉందని, భారత క్రికెట్‌కు ఇదొక దుర్దినమని మరో క్రికెట్‌ ప్రేమికుడు వాపోయాడు. 16 ఏళ్ల మీ సేవలను ప్రణమిల్లుతున్నామని ఓ అభిమాని కృతజ్ఞతలు తెలిపాడు.


(చదవండి: మహేంద్రుడి మాయాజాలం)

అతని సారథ్యంలోనే..
2007లో టీ-20 ప్రపంచ కప్, ఆ తర్వాత భారత అభిమానులంతా కలలుగన్న వన్డే వరల్డ్‌ కప్‌ (2011)ను ధోని సారథ్యంలోనే టీమిండియా సాధించింది. అతని కెప్టెన్సీలోనే 2013లో టీమిండియా చాంపియన్‌ ట్రోఫీని కూడా సాధించింది. తద్వారా మూడు ఐసీసీ టోర్నీలను గెలిచిన ఏకైక కెప్టెన్‌గా ధోని నిలిచాడు. 2008, 2009లలో అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డులు సాధించాడు. వరుసగా రెండేళ్లు ఈ అవార్డు గెల్చుకున్న తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. 350 వన్డేలు, 90 టెస్టులు, 98 టీ-20 మ్యాచ్‌లను ధోని ఆడాడు. 50 సగటుతో వన్డేల్లో 10,773 పరుగులు సాధించాడు. ఇందులో 10 సెంచరీలు, 73 అర్థ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో 4876 పరుగులు, టీ-20ల్లో 1617 పరుగులు చేశాడు.
(రాముడి బాటలో లక్ష్మణుడు...)

మరిన్ని వార్తలు