ఐపీఎల్‌కు కూడా ధోని గుడ్‌ బై చెప్తాడా!?

24 Oct, 2020 13:12 IST|Sakshi

దుబాయ్‌: కరోనా ఆంక్షల వల్ల అనుకున్నంత ప్రాక్టీస్‌ చేయలేకపోవడం, కీలక ఆటగాళ్లు రైనా, హర్భజన్‌ జట్టుకు దూరమవడం, ఆటగాళ్ల ఫామ్‌ లేమితో ఐపీఎల్‌ 2020లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్రదర్శన సగటు అభిమానులను నిరాశలో ముంచింది. 11 మ్యాచ్‌లలో ఎనిమిదింట ఓటమిపాలైన ధోని సేన ప్లే ఆఫ్స్‌కు దూరమైంది. లీగ్‌ దశలో మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా.. వాటితో జట్టుకు పెద్దగా ఉపయోగం ఉండబోదు. అయితే, చెన్నై ఆటతీరుతో దిగాలు పడుతున్న అభిమానులను కొన్ని ఊహాగానాలు కలవరపుట్టిస్తున్నాయి. తాజా సీజన్‌ ముగియగానే ధోని ఐపీఎల్‌ నుంచి కూడా రిటైర్‌ అవుతారనే ప్రచారం జరుగుతోంది.

శుక్రవారం ముంబైతో మ్యాచ్‌ అనంతరం కెప్టెన్‌ ధోని పాండ్యా సోదరులకు తన జెర్సీ బహూకరించడమే దీనికి కారణం. గత మంగళవారం రాజస్తాన్‌తో మ్యాచ్‌ అనంతరం కూడా ఇంగ్లండ్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌కు ధోని తన జెర్సీని గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆ మ్యాచ్‌లో 48 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో అజేయంగా 70 పరుగుల సాధించిన బట్లర్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ వరించింది. దాంతోపాటు తన అభిమాన, ఆరాధ్య ఆటగాడి నుంచి కూడా జెర్సీ రూపంలో బహుమతి లభించడంతో బట్లర్‌ అమితానందం వ్యక్తం చేశాడు. ధోని వ్యవహార శైలి చూస్తుంటే ఈ ఐపీఎల్‌ చివరది కావొచ్చని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన మహేంద్ర సింగ్‌ ధోని అభిమానులకు ఝలక్‌ ఇస్తారో చూడాలి!

మరిన్ని వార్తలు