MS Dhoni: నెంబర్‌-7 మిస్టరీ వెనుక మనం ఊహించని ట్విస్ట్‌

17 Mar, 2022 08:12 IST|Sakshi

క్రీడల్లో ఆటగాళ్లకంటూ ప్రత్యేకమైన జెర్సీలు ఉంటాయి. ఆ జెర్సీలను వాళ్ల తమ అదృష్టంగా భావిస్తూ రిటైర్‌ అయ్యేవరకు ఆ ఒక్క జెర్సీతోనే ఆడుతుంటారు. ఉదాహరణకు ఫుట్‌బాల్‌ స్టార్‌ ఆటగాళ్లు లియోనల్‌ మెస్సీ (జెర్సీ నెంబర్‌ 10), లెబ్రన్‌ జేమ్స్‌(జెర్సీ నెంబర్‌ 23), క్రిస్టియానో రొనాల్డో(జెర్సీ నెంబర్‌ 7), క్రికెట్‌లో సచిన్‌ టెండూల్కర్‌(జెర్సీ నెంబర్‌ 10), విరాట్‌ కోహ్లి( జెర్సీ నెంబర్‌ 18), యువరాజ్‌ సింగ్‌(జెర్సీ నెంబర్‌ 12).. ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి.

మరి టీమిండియాకు రెండుసార్లు ప్రపంచకప్‌ అందించిన కెప్టెన్‌గా ఘనత సాధించిన మహేంద్ర సింగ్‌ ధోని కూడా తన కెరీర్‌ మొత్తం ఒకటే జెర్సీతో బరిలోకి దిగాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన సమయంలో.. ప్రస్తుత ఐపీఎల్‌లోనూ ధోని నెంబర్‌-7 జెర్సీతోనే ఆడడం చూస్తున్నాం. ధోని 7వ నెంబర్‌ జెర్సీ ధరించడంపై క్రికెట్‌ ఫ్యాన్స్‌ రకరకాలుగా చెప్పుకున్నారు. 

అయితే తాజాగా నెంబర్‌-7 వెనుక ఉన్న మిస్టరీని ధోని వివరించాడు.నెంబర్‌ -7 జెర్సీ ధరించడం వెనుక కారణం కేవలం అదే తేదీన తన పుట్టినరోజు కావడమేనని ధోని పేర్కొన్నాడు. ఐపీఎల్‌ ప్రారంభం సందర్భంగా ధోని ఒక ఇంటర్య్వూలో ఈ వ్యాఖ్యలు చేశాడు. ''చాలా మంది నెంబర్‌-7 నాకు లక్కీ నెంబర్‌ అని అభిప్రాయపడ్డారు. కానీ అలాంటిదేం లేదు. వాస్తవానికి జూలై 7న నా పుట్టినరోజు. ఏడో నెలలో.. ఏడో తారీఖున పుట్టాను గనుక ఆ నెంబర్‌ ఎందుకో నాకు బాగా నచ్చింది. ఇంకో విశేషమేమిటంటే.. నేను పుట్టిన సంవత్సరం 1981. దీనిలో చివరి రెండు అంకెలు చూసుకుంటే.. (8-1=7).. ఈ నెంబర​ చాలా న్యూట్రల్‌గా ఉంటుంది. ఇలాంటివి పెద్దగా నమ్మను. కానీ ఎందుకో ఆ నెంబర్‌ నా గుండెల్లోకి దూసుకుపోయింది. అందుకే నా కెరీర్‌లో నెంబర్‌-7 జెర్సీని ఎవరికి ఇవ్వకుండా నా దగ్గరే పెట్టుకున్నా.. ఇకపై నా దగ్గరే ఉంటుంది'' అని చెప్పుకొచ్చాడు.

ఇక ధోనికి ఇదే చివరి ఐపీఎల్‌ సీజన్‌ అని ఉహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ 15వ సీజన్‌ టైటిల్‌ గెలిచి ధోనికి కానుకగా ఇవ్వాలని సీఎస్‌కే భావిస్తోంది. ఇప్పటికే అందరికంటే ముందే సూరత్‌ వేదికగా ట్రెయినింగ్‌ క్యాంప్‌ను ప్రారంభించిన సీఎస్‌కే తమ ప్రాక్టీస్‌ను వేగవంతం చేసింది. ఇక మార్చి 26న సీఎస్‌కే, కేకేఆర్‌ మధ్య జరగనున్న మ్యాచ్‌లో ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌కు తెరలేవనుంది.

చదవండి: Prithvi Shaw: ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్‌.. యోయో టెస్ట్‌లో విఫలమైన కీలక ప్లేయర్‌

European Cricket League: మరి ఇంత తొందరేంటి.. రనౌట్‌ చేయాల్సింది

మరిన్ని వార్తలు