సచిన్‌ కొడుకు ధోని.. టీచర్‌ జాబ్‌కు దరఖాస్తు; ఫోటో వైరల్‌

3 Jul, 2021 17:26 IST|Sakshi

రాయ్‌పూర్‌: సచిన్‌ టెండూల్కర్‌ కొడుకు అర్జున్‌ టెండూల్కర్‌  కదా.. ఎంఎస్‌ ధోని అంటారేంటి.. అయినా ధోని టీచర్‌ జాబ్‌కు దరఖాస్తు చేసుకోవడం ఏంటి అనేగా మీ డౌటు. కానీ మీరు వింటున్నది నిజమే. ఒక ఆకతాయి చేసిన పనితో చత్తీస్‌ఘడ్‌ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఎలా ఉంటుందో మరోసారి ఈ వార్తతో తెలిసొచ్చింది. అసలే ఉద్యోగాల నోటిఫికేషన్‌లు లేక అల్లాడిపోతున్న నిరుద్యోగులు ఇలాంటి దిక్కుమాలిన పనుల వల్ల మరింత ​ఆగ్రహానికి గురవుతున్నారు.

విషయంలోకి వెళితే.. చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో టీచర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియకు గతంలో నోటిఫికేషన్‌ విడుదల చేయగా.. తాజాగా ముఖాముఖి ఇంటర్య్వూకు దరఖాస్తు చేసుకున్న వారిలో నుంచి 15 మంది అభ్యర్థుల షార్ట్‌ లిస్ట్‌ను ఎంపిక చేశారు. ఆ షార్ట్‌ లిస్ట్‌లో తొలిపేరు మహేంద్ర సింగ్‌ ధోని సన్నాఫ్‌ సచిన్‌ టెండూల్కర్‌ , రాజ్‌పూర్‌ జిల్లా అని రాసి ఉంది. అప్లికేషన్‌ ప్రకారం ఎంఎస్‌ ధోని దుర్గ్‌లోని సీఎస్‌వీటీయూ యునివర్సిటీలో ఇంజనీరింగ్‌ డిగ్రీ పూర్తి చేసినట్లు ఉంది. ఇలాంటి పేర్లతో అప్లికేషన్‌లు వచ్చినప్పడు కనీసం అక్కడి అధికారులు ఒక్కసారి కూడా ఎంక్వైరీ చేసుకోకపోవడం విశేషం. కాగా శుక్రవారం ఆ 15 మందిని ఇంటర్య్వూకు పిలిచారు. అయితే ధోని పేరుతో ఉన్న అభ్యర్థి ఇంటర్య్వూకు రాలేదు. దీంతో అప్లికేషన్‌లో ఉన్న మొబైల్‌ నెంబర్‌కు కాల్‌ చేయగా స్విచ్చాఫ్‌ వచ్చింది.

అప్పుడు విషయం అర్థం చేసుకున్న అధికారులు అప్లికేషన్‌ నకిలీదని గుర్తించారు. ఈ వ్యవహారం ఇంటర్య్వూకు వచ్చిన మిగతా అభ్యర్థులకు తెలియడంతో దానికి సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్‌గా మారాయి. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అసలు ధోని పేరుతో దరఖాస్తు ఎలా వచ్చిందా అని తలలు పట్టుకున్న అధికారులు అది నకిలీ అని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఇటీవలే సినిమా హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ బిహార్‌లో టీచర్‌ జాబ్‌కు ఎంపికైన విషయం వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు