తెలంగాణలో ధోని క్రికెట్‌ అకాడమీలు..?

12 Feb, 2021 19:34 IST|Sakshi

హైదరాబాద్‌: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని త్వరలో తెలంగాణలో క్రికెట్‌ అకాడమీలు ప్రారంభించబోతున్నాడు. ఎంఎస్‌ ధోని క్రికెట్‌ అకాడమీ పేరుతో ప్రారంభంకానున్న ఈ అకాడమీలను ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ సంస్థ, బ్రెయినియాక్స్‌ బీ అనే సంస్థలు సంయుక్తంగా ప్రారంభించేందుకు శుక్రవారం ఒప్పందం కుదుర్చుకున్నాయి. రాబోయే రెండేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా 15 అకాడమీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆర్కా స్పోర్ట్స్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌, భారత మాజీ అండర్‌-19 ప్రపంచకప్‌ జట్టు సభ్యుడు మిహిర్ దివాకర్ వెల్లడించారు. అకాడమీలను అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా క్రికెట్‌ అకాడమీలు నెలకొల్పడం ధోని చిరకాల కోర్కె అని ఆయన ప్రకటించాడు.

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన ఆటగాళ్లకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ఈ అకాడమీలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే రెండేళ్ల కాలంలో తెలంగాణతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో దాదాపు 25 శిక్షణా కేంద్రాలను నెలకొల్పడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అకాడమీ కోచింగ్‌ డైరెక్టర్‌గా సౌతాఫ్రికా మాజీ బ్యాట్స్‌మెన్‌ డారెల్‌ కలీనన్‌ కొనసాగుతారన్నారు. తమ సంస్థకు చెందిన మొదటి అకాడమీ ఈ ఏడాది ఏప్రిల్‌లో బళ్లారిలో ప్రారంభంకానుందని వెల్లడించారు. కాగా, ఇప్పటికే భారత్‌లో 50కి పైగా కేంద్రాలు, విదేశాల్లో మూడు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ధోని త్వరలో విద్యారంగంలోకి కూడా అడుగు పెట్టబోతున్నాడని, ఈ ఏడాది జూన్‌ నుంచి బెంగళూరులో ఎంఎస్‌ ధోని గ్లోబల్‌ స్కూల్‌ను ప్రారంభంకానుందని ఆయన ప్రకటించాడు.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు