‘ధోని చెప్పాడు.. నేను ఫాలో అవుతున్నా’

3 Dec, 2020 11:36 IST|Sakshi
జడేజా-ధోని(ఫైల్‌ఫోటో)

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో తాను కీలక ఇన్నింగ్స్‌ ఆడటంలో క్రెడిట్‌ అంతా టీమిండియా మాజీ కెప్టెన్‌, సీఎస్‌కే కెప్టెన్‌  ఎంఎస్‌ ధోనిదే అంటున్నాడు రవీంద్ర జడేజా. ఐపీఎల్‌లో సీఎస్‌కేకు ప్రాతినిథ్యం వహిస్తున్న జడేజా.. తన బ్యాటింగ్‌ మెరుగుపడటానికి ప్రధాన కారణం ధోనినే అని పేర్కొన్నాడు. మూడో వన్డేలో టీమిండియా విజయం సాధించిన తర్వాత పోస్ట్‌ మ్యాచ్‌ ఇంటర్వ్యూలో భాగంగా సోనీ స్పోర్ట్‌తో మాట్లాడిన జడేజా.. ‘ ధోని భాయ్‌తో కలిసి అటు టీమిండియాకు చాలా కాలం ఆడాను. అలాగే సీఎస్‌కే తరఫున కూడా ఆడుతున్నా. ధోని ఎప్పుడూ భాగస్వామ్యాలు నమోదు చేయడంపైనే ఎక్కువ ఫోకస్‌ చేస్తాడు. ఒక్కసారి బ్యాట్స్‌మన్‌ క్రీజ్‌లో సెట్‌ అయిన తర్వాత భారీ షాట్లు ఆడటానికి వీలుంటుందని ధోనినే చెబుతూ ఉండేవాడు. (చదవండి: ‘అదే మ్యాచ్‌లో టర్నింగ్‌  పాయింట్‌’)

చాలా కీలక సందర్భాల్లో ధోనితో కలిసే నేను ఎక్కువగా ఆడా. అతనితో కలిసి ఆడటాన్ని బాగా ఆస్వాదిస్తా. ధోని ఎప్పుడూ ఒక్కటే చెబతాడు. కడవరకూ క్రీజ్‌లో ఉండటానికి యత్నిస్తే పరుగులు అవే వస్తాయనే సూత్రాన్ని ధోని ఫాలో అవుతాడు. అదే విషయాన్ని నాకు చెప్పేవాడు. చివరి నాలుగు-ఐదు ఓవర్లో విలువైన పరుగులు సాధించాలంటే ముందు క్రీజ్‌లో ఉండటానికి యత్నించాలి అనే దాన్ని ధోని నమ్ముతాడు. ప్రధానంగా కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో భాగస్వామ్యం నమోదు చేయడం చాలా ముఖ్యం. అదే పరిస్థితి ఆసీస్‌తో చివరి వన్డేలో ఎదురైంది. హార్దిక్‌తో కలిసి మంచి భాగస్వామ్యాన్ని సాధించినందుకు సంతోషంగా ఉంది. ఆఖరి ఐదు ఓవర్లలో చాన్స్‌ తీసుకుందామని హార్దిక్‌-నేను అనుకున్నాం. అదే అమలు చేసి అప్పటివరకూ స్ట్రైక్‌ రొటేట్‌ చేశాం. అదే గేమ్‌ ప్లాన్‌లో భాగం’ అని తెలిపాడు.(చదవండి:హ్యాట్సాఫ్‌ జడేజా : మంజ్రేకర్‌)

నిన్న ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. పాండ్యా(92 నాటౌట్‌), జడేజా(66 నాటౌట్‌)లు రాణించి జట్టు స్కోరు మూడొందలు దాటడంలో సహకరించాడు. వీరికంటే ముందు కోహ్లి(63) హాఫ్‌ సెంచరీ సాధించాడు. 303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ 49.3 ఓవర్లలో 289 పరుగులకే ఆలౌటై పరాజయం చెందింది.  శార్దూల్‌ ఠాకూర్‌ మూడు వికెట్లతో రాణించగా,  బుమ్రా, నటరాజన్‌లు తలో రెండు వికెట్లు సాధించారు. కుల్దీప్‌, జడేజాలకు తలో వికెట్‌ దక్కింది.

మరిన్ని వార్తలు