ధోనికి నెగెటివ్‌

14 Aug, 2020 01:48 IST|Sakshi

కరుణ్‌ నాయర్‌కూ... నెగెటివ్‌

రాంచీ: చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనికి చేసిన కోవిడ్‌–19 పరీక్షలో నెగెటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. ఐపీఎల్‌ తాజా నిబంధనల్లో భాగంగా  అతనికి పరీక్ష చేశారు. ఇక్కడి గురునానక్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ప్రతినిధులు నగర శివార్లలో ఉన్న ధోని ఫామ్‌హౌస్‌కు వెళ్లి అతని శాంపిల్స్‌ సేకరించారు. గురువారం రాత్రికి ఫలితాలు వచ్చాయి. ధోనితో పాటే చెన్నై జట్టులోని సభ్యుడైన మోనూ కుమార్‌ కూడా కరోనా పరీక్షకు హాజరయ్యాడు. ఫలితాల్లో నెగెటివ్‌గా రావడంతో ధోని నేడు చెన్నైకి వెళ్లి శిక్షణా శిబిరంలో పాల్గొంటాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం వరుసగా రెండు టెస్టుల్లో నెగెటివ్‌ వస్తేనే యూఏఈ విమానం ఎక్కేందుకు అనుమతిస్తారు.  

కుటుంబ సభ్యులు లేకుండా... 
ఈ నెల 22న సూపర్‌ కింగ్స్‌ టీమ్‌ యూఏఈకి బయల్దేరనుంది. అయితే ఆటగాళ్ల వెంట కుటుంబ సభ్యులెవరినీ తీసుకు వెళ్లరాదని ఫ్రాంచైజీ నిర్ణయించింది. ‘ప్రస్తుతం టీమ్‌ సభ్యులు, సహాయక సిబ్బంది మినహా ఎవరూ రారు. లీగ్‌ సాగుతున్న కొద్దీ మున్ముందు ఏదైనా దశలో దీనిపై పునరాలోచిస్తాం. అవకాశాన్ని బట్టి అప్పుడు కుటుంబ సభ్యులను అనుమతించే విషయం పరిశీలిస్తాం’ అని సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్‌ వెల్లడించారు.  

నాయర్‌ కోలుకున్నాడు
కర్ణాటక బ్యాట్స్‌మన్, ఐపీఎల్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న కరుణ్‌ నాయర్‌ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాడు. గత నెలలో కోవిడ్‌–19 బారిన పడిన అతను 14 రోజుల పాటు సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందాడు. చికిత్స అనంతరం ఈ నెల 8న అతనికి మళ్లీ పరీక్షలు నిర్వహించగా ‘నెగెటివ్‌’గా తేలాడు. దాంతో నాయర్‌ ప్రాక్టీస్‌ కూడా మొదలు పెట్టినట్లు తెలిసింది. అయితే ఈ ఫలితంతో అతను యూఏఈ వెళ్లేందుకు అవకాశం లేదు. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టులోని ఇతర ఆటగాళ్లలాగే కరుణ్‌ కూడా మళ్లీ మూడు సార్లు కరోనా పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. భారత్‌ తరఫున టెస్టుల్లో ట్రిపుల్‌ సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా గుర్తింపు పొందిన కరుణ్‌ నాయర్‌... మూడేళ్ల క్రితం చివరి సారిగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.  

మరిన్ని వార్తలు