MS Dhoni: 'ధోని కెప్టెన్సీలో ఆడటం నా అదృష్టంగా భావిస్తున్నా'

7 Jun, 2022 11:00 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

తన అంతర్జాతీయ అరంగేట్ర రోజుల్లో టీమిండియా లెజెండ్‌  ఎంఎస్ ధోని ఎంతో మద్దతుగా నిలిచాడని భారత స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా చెప్పాడు. కాగా ఎంతో మంది యువ ఆటగాళ్లను ప్రపంచ స్థాయి ఆటగాళ్లుగా ధోని తీర్చిదిద్దాడు. ధోని సారథ్యంలో 2016లో భారత తరపున హార్ధిక్‌ పాండ్యా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలో గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న పాండ్యా.. ‘‘నేను భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు సురేష్ రైనా, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లి వంటి స్టార్‌ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు.

తొలి మ్యాచ్‌లో నేను కాస్త ఒత్తిడిని ఎదర్కొన్నాను. నేను వేసిన తొలి ఓవర్‌లోనే ఏకంగా 21 పరుగులు సమర్పించుకున్నాను.  ఇక ఆ మ్యాచ్‌లో అదే నా చివరి ఓవర్ కావచ్చు అని నేను భావించాను. అయితే మహి భాయ్ నాపై నమ్మకంతో మరో రెండు ఓవర్లు వేసే అవకాశం ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో నేను వేసిన మూడు ఓవర్లలో 37 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాను.

సదరు సిరీస్‌ ముగిసిన తర్వాత ప్రపంచకప్‌ జట్టులో ఉంటావంటూ ధోని చెప్పడంతో ఆశ్చర్యపోయా. ఎందుకంటే అప్పటికీ అది నా మూడో అంతర్జాతీయ మ్యాచ్‌. నిజంగా ధోని కెప్టెన్సీలో ఆడటం నా అదృష్టంగా భావిస్తున్నాను" అని ఎస్‌జీటీవీ పోడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హార్ధిక్‌ పాండ్యా పేర్కొన్నాడు. ఇక స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ 20 సిరీస్‌కు భారత జట్టులో హార్ధిక్‌ చోటు దక్కించుకున్నాడు.

ఇక ఐపీఎల్‌-2022తో క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన కొత్త జుట్టకు సారథ్యం వహించిన హార్దిక్‌ తొలి సీజన్‌లోనే టైటిల్‌ గెలిచి చరిత్ర సృష్టించాడు. సీజన్‌ ఆరంభంలో ధోని కెప్టెన్సీ నుంచి పాఠాలు నేర్చుకున్న తాను అదే విధంగా ముందుకు సాగుతానంటూ చెప్పిన పాండ్యా.. ఆ మాటను నిలబెట్టుకున్నాడంటూ అభిమానులు మురిసిపోయారు.
చదవండి: అందుకే నేను వికెట్‌ కీపర్‌ అయ్యాను: రిషబ్ పంత్

మరిన్ని వార్తలు