ఒక్క సీజన్‌కే ధోనిని తప్పుపడతారా?

28 Oct, 2020 21:41 IST|Sakshi

ముంబై : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో దారుణమైన ప్రదర్శన కనబరిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ లీగ్‌ నుంచి వైదొలిగిన తొలి జట్టుగా నిలిచింది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన సీఎస్‌కే అభిమానులు ఆశలను అడియాశలు చేస్తూ.. ఎవరూ ఊహించిన విధంగా 12 మ్యాచ్‌ల్లో నాలుగే విజయాలు నమోదు చేసి ఏకంగా ఎనిమిది ఓటములతో తీవ్రంగా నిరాశపరిచింది. ఐపీఎల్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పాయింట్ల పట్టికలో తొలిసారి చివరి స్థానానికి పరిమితం అయ్యింది. (చదవండి : శామ్యూల్స్‌కు మతి చెడింది)

మూడు సార్లు ఛాంపియన్‌, ఐదుసార్లు రన్నరఫ్‌తో పాటు అన్ని సీజన్స్‌లో ఫ్లే ఆఫ్స్‌కి చేరిన ఘనత కలిగిన చెన్నై ఈసారి టోర్నీలో కనీస పోరాట పటిమను సైతం చూపలేక ఆటగాళ్లు ప్రత్యర్థికి దాసోహమన్నారు. టోర్నీ ఆసాంతం ఫేలమైన ఆట తీరుతో సీనియర్‌ సిటిజన్స్‌ అనే బిరుదుతో పాటు అభిమానుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలను సైతం ఎదుర్కొంది. ఇక కెప్టెన్‌గా ధోని పూర్తిగా విఫలమయ్యాడని.. చెన్నై టీం మొత్తం ప్రక్షాళన చేయల్సిందేనంటూ సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ వచ్చిన విషయం విధితమే.  ఐపీఎల్‌ 2021 సీజన్‌లోనూ ధోనియే చెన్నై టీంకు సారథ్యం వహిస్తారని ఆ జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్‌ మంగళవారం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో భారత మాజీ మహిళా క్రికెటర్‌ అంజుమ్‌ చోప్రా ఎంఎస్‌‌ ధోని నాయకత్వాన్ని అందరూ విమర్శించడం పట్ల తప్పుబట్టారు. ' ఇది ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఎంఎస్‌ ధోని 2008 నుంచి 2020 వరకు( మధ్యలో రెండు సీజన్లు మినహాయించి) చెన్నై సూపర్‌ కింగ్స్‌ను తన భుజాలపై మోశాడు. ఐపీఎల్‌ చరిత్రలో ధోని ఒక్కసారి కూడా వేలంలోకి వెళ్లలేదు. ఒక ఐకానిక్‌ ప్లేయర్‌గా సీఎస్‌కే జట్టుకు నాయకత్వం వహించాడు. అలాంటిది ఏదో ఒక్క సీజన్‌లో విఫలమైనంత మాత్రానా అతని నాయకత్వ ప్రతిభను తప్పుబట్టడం సరికాదు. అనుభవజ్ఞమైన ఆటగాడిగా భారత క్రికెట్‌కు  సేవలందించిన ధోని.. ఎన్నోసార్లు మ్యాచ్‌విన్నర్‌గా నిలిచాడు. ఇటు ఐపీఎల్‌లోనూ సీఎస్‌కేను విజయవంతంగా నడిపించిన ధోనికి ఒకవేళ జట్టు విఫలమైతే ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయో అతనికి ముందుగానే తెలుసు. అయినా సీఎస్‌కేనే ప్రతీ సీజన్‌లోనూ టైటిల్‌ గెలవలేదు కదా.. ఏదో ఒక సీజన్‌లో ఘోర ప్రదర్శన చేసినంత మాత్రానా ఒక్క ధోనినే తప్పు బట్టడం సమంజసం కాదు. (చదవండి : అతని ఆట నాకు ఆశ్చర్యం కలిగించింది)

ధోని విఫలమైన మాట నిజమే.. కానీ జట్టులోని మిగతా ఆటగాళ్లు సమిష్టి ప్రదర్శన చేయకపోవడంతోనే ఇలాంటి ప్రదర్శనలు వస్తాయని మాత్రం ఎవరు మాట్లాడుకోవడం లేదు. అయినా ధోనికి ఇలాంటివేం కొత్తేమి కాదు.. సీఎస్‌కే జట్టును మళ్లీ బౌన్స్‌బాక్‌ చేసే సత్తా ధోనికి ఉందని నేను నమ్ముతున్నా. వచ్చే సీజన్‌లో గనుక ధోని నాయకత్వం వహిస్తే సరికొత్త సీఎస్‌కేను చూడడం ఖాయంగా చెప్పవచ్చు. ' అంటూ చెప్పుకొచ్చారు. కాగా ఇప్పటికే ప్లేఆఫ్‌కు దూరమైన సీఎస్‌కే తన తర్వాతి మ్యాచ్‌లో అక్టోబర్‌ 29న కేకేఆర్‌ను ఎదుర్కోనుంది. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు