MS Dhoni: పాక్‌పై బౌల్‌ అవుట్‌ విజయానికి 14 ఏళ్లు.. ధోని వ్యూహాలు ఫలించడంతో..

14 Sep, 2021 17:31 IST|Sakshi

MS Dhoni wins first-ever match as captain: సరిగ్గా 14 ఏళ్ల క్రితం ఇదే  రోజున టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని విజయాల పరంపర మొదలైంది. 2007 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ ఘోర వైఫల్యం తరువాత సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్‌ వంటి సీనియర్‌ ఆటగాళ్లు మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్‌లో ఆడేందుకు ఇష్టపడలేదు. ఈ నేపథ్యంలో 2007 టీ20 ప్రపంచ కప్‌లో  యువ భారత జట్టుకు ధోని నాయకత్వం వహించాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌ స్కాట్లాండ్‌తో జరగాల్సి ఉండగా.. వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో భారత్‌ తన తొలి మ్యాచ్‌ దాయాది దేశం పాకిస్తాన్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి మెదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 141 పరుగులకే పరిమితమైంది.

అనంతరం 142 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పాక్ జట్టు, భారత బౌలర్ల ధాటికి  87 పరుగులకే కీలకమైన 5 వికెట్లు కోల్పోయింది. ఇక భారత్‌ విజయం లాంఛనమే అనుకున్న సమయంలో పాక్ బ్యాట్స్‌మెన్ మిస్బా వుల్ హక్ అద్భుతమైన పోరాటంతో టెయిలెండర్లతో కలిసి విజయం అంచుల దాకా తెచ్చాడు. ఆఖరి ఓవర్‌లో పాక్ విజయానికి 12 పరుగులు కావాలి. శ్రీశాంత్ వేసిన  చివరి ఓవర్లో మొదటి నాలుగు బంతుల్లోనే రెండు ఫోర్లు రావడంతో 11 పరుగులు వచ్చేశాయి. రెండు బంతుల్లో ఒక్క  పరుగు మాత్రమే కావాలి. ఐదో బంతికి  పరుగులేమీ లేదు. చివరి బంతికి సింగిల్ తీయబోయిన మిస్బా వుల్... రనౌట్ కావడంతో మ్యాచ్ టైగా ముగిసింది.

చదవండిబ్లూ కలర్ జెర్సీలో కనిపించనున్న ఆర్సీబీ.. ఎందుకంటే?

ఫలితం తేల్చేందుకు అంపైర్లు బౌల్-అవుట్ పద్ధతిని ఎంచుకున్నారు.  బౌల్- అవుట్ పద్ధతి అంటే ఇరుజట్లు బౌల్‌ చేసి 6 బంతుల్లో వికెట్లు పడగొట్టాలి. ఏ జట్టు ఎక్కువ వికెట్లు తీస్తే వారిదే విజయం. ఈ నేపథ్యంలో ధోనీ  వ్యూహాలను రచించాడు. కేవలం స్పిన్నర్‌లతో బౌలింగ్‌ చేయించేందుకు నిర్ఱయించుకున్నాడు. మొదటి బంతిని అందుకున్న పార్ట్ టైమ్ ఆఫ్ స్పిన్నర్‌  వీరేంద్ర సెహ్వాగ్... క్లీన్ బౌల్డ్ చేశాడు. పాక్ నుంచి మీడియం పేసర్  యాసిర్ అరాఫత్‌ వేసిన బంతి వికెట్లను తాకలేదు. దీంతో భారత్‌  1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

తరువాత రెండో బంతి అందుకున్న హర్భజన్ సింగ్ వికెట్లను పడగొట్టాడు. పాక్ తరుపున ఆ జట్టు  స్టార్ బౌలర్ ఉమర్ గుల్ వేసిన బంతి వికెట్లకు చాలా దూరంగా వెళ్లింది. దీంతో టీమిండియా 2-0 లీడ్‌లోకి వెళ్లింది. మూడో బంతి వేసిన రాబిన్ ఊతప్ప కూడా వికెట్‌ తీశాడు. పాక్‌ మిగత బంతులు విసరాలి అంటే మూడో బంతికి వికెట్‌ తీయాల్సిందే. ఆ సమయంలో బాల్ అందుకున్న షాహిదీ ఆఫ్రిదీ వికెట్లను కూల్చడంలో గురి తప్పాడు. దీంతో 3-0 తేడాతో టీమిండియా విజయాన్ని దక్కించుకుంది. ధోని కెప్టెన్‌గా  తన కేరిర్‌లో తొలి విజయాన్ని అందుకున్నాడు.

ఇక టీ20 వరల్డ్‌కప్ ‘బాల్‌ అవుట్’లో తొలి విజయం ఇదే కావడం విశేషం. అటు తర్వాత  ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లను ఓడించిన టీమిండియా టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరింది. ఫైనల్లో మరోసారి భారత్‌ దాయాది పాకిస్తాన్‌తో తలపడింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌ మ్యాచ్‌లోనూ భారత్‌ విజయం సాధించి చరిత్ర సృష్టించింది. 2007 టీ20 ప్రపంచ కప్‌ను ముద్దాడింది. ధోని కెప్టెన్సీలోనే 2011 వన్డే వరల్డ్ కప్ , 2013 ఛాంపియన్స్ ట్రోఫీని సైతం టీమిండియా సాధించింది. మూడు ఐసీసీ ట్రోఫీలను అదించిన ఏకైక కెప్టెన్‌గా ధోని చరిత్ర సృష్టించాడు.

చదవండి: T20 World Cup 2021: ఇలాగే చేస్తే అతడు రిటైర్మెంట్ ప్రకటించవచ్చు...

మరిన్ని వార్తలు