‘అందుకే అంబటి రాయుడ్ని తీసుకోలేదు’

10 Aug, 2020 13:46 IST|Sakshi

న్యూఢిల్లీ: గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా అంబటి రాయుడు భారత క్రికెట్‌ జట్టులో చోటు కోసం చివరి వరకూ ఎదురుచూసినా నిరాశే ఎదురైంది. ఎంఎస్‌కే ప్రసాద్‌ నేతృత్వంలోని అప్పటి సెలక్షన్‌ కమిటీ రాయుడ్ని పరిగణలోకి తీసుకోలేకపోవడంతో అది అప్పట్లో హాట్‌ టాపిక్‌ అయ్యింది. వరల్డ్‌కప్‌కు రాయుడ్ని పక్కకు పెట్టిన సెలక్టర్లు.. విజయ్‌ శంకర్‌కు అవకాశం ఇచ్చారు. ఆ క్రమంలోనే విజయ్‌ శంకర్‌ ‘3డీ(బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌) ప్లేయర్‌ అంటూ ఎంఎస్‌కే కామెంట్‌ చేయడంతో రాయుడిలో మరింత అసంతృప్తిని రేకెత్తించింది. (‘న్యూజిలాండ్‌ను సాకుగా చూపడం లేదు’)

భారత జట్టు 3డీ ఆటను చూడటానికి 3డీ గ్లాసెస్‌ కోసం ఆర్డర్‌ చేశానంటూ సెటైరిక్‌గా రాయుడు స్పందించడం మరింత వివాదంగా మారింది. కాగా, విజయ్‌ శంకర్‌ గాయంతో తిరిగి వచ్చిన క్రమంలో కూడా రాయుడికి అవకాశం ఇవ్వకుండా, రిషభ్‌  పంత్‌ను ఇంగ్లండ్‌కు పిలిపించారు. దాంతో రాయుడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించాడు. అటు తర్వాత తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న రాయుడు.. హైదరాబాద్‌ రంజీ జట్టుకు సైతం కెప్టెన్‌గా చేశాడు. కాగా, హెచ్‌సీఏపై అవినీతి ఆరోపణలు చేసిన రాయుడు గత కొంతకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు.

కాగా, అప్పుడు రాయుడ్ని వరల్డ్‌కప్‌లోకి ఎందుకు తీసుకోలేదనే దానిపై మాజీ చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్‌కే మరొకసారి స్పందించాడు. స్పోర్ట్స్‌ స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంబటి ఉద్వాసన గురించి అడగ్గా అందుకు ప్రసాద్‌ బదులిచ్చాడు. ‘ అంబటి రాయుడు కచ్చితంగా అనుభవం ఉన్న బ్యాట్స్‌మన్‌ అనడంలో ఎటువంటి సందేహం లేదు. మేము వరల్డ్‌కప్‌ దృష్టిలో పెట్టుకుని అనుభవానికే పెద్ద పీట వేశాం. ఆ క్రమంలోనే అంబటి రాయుడు ఏడాది పాటు జట్టులో రెగ్యులర్‌ సభ్యుడిగా ఉన్నాడు. అయితే వరల్డ్‌కప్‌కు తీసుకునే నమ్మకాన్ని అతను మాకు కల్పించలేకపోయాడు. దాంతో రాయుడ్ని పక్కకు పెట్టాల్సి వచ్చింది. ఇక యువ క్రికెటర్లవైపు చూడటం కూడా మంచిది కాదనుకున్నాం. ఆ టోర్నమెంట్‌ ఇంగ్లండ్‌లో  జరుగుతుండటంతో అన్ని రకాలుగా పకడ్బందీగా వెళ్లాలనుకున్నాం. 2016లో జింబాబ్వే పర్యటన తర్వాత రాయుడు టెస్టు సెలక్షన్‌పై ఫోకస్‌ చేసి ఉండాల్సింది. ఆ విషయాన్ని రాయుడికి చాలాసార్లు చెప్పాను కూడా. టెస్టు క్రికెట్‌పై ఎందుకు ఫోకస్‌ చేయడం లేదని చాలాసార్లు ఆడిగా’ అని ఎంఎస్‌కే చెప్పుకొచ్చాడు. (‘బుమ్రా యాక్షన్‌తో అతనికే చేటు’)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు