ఇషాన్‌ కిషన్‌పై ఎమెస్కే ప్రశంసల జల్లు!

14 Nov, 2020 14:51 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐపీఎల్‌-2020 సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ముంబై ఇండియన్స్‌ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌పై టీమిండియా మాజీ చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్‌ఎస్‌కే ప్రసాద్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇటు ఓపెనర్‌గా.. అటు నాల్గవ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఆటగాడిగా మెరుగ్గా రాణించాడని, పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మలచుకోవడం అతడి ప్రతిభకు నిదర్శనమన్నాడు. త్వరలోనే అతడు జాతీయ జట్టుకు ఎంపికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్‌ ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడిన డిపెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ జయకేతనం ఎగుర వేసిన సంగతి తెలిసిందే. తద్వారా క్యాష్‌ రిచ్‌లీగ్‌లో ఐదోసారి టైటిల్‌ను సాధించిన జట్టుగా చరిత్ర సృష్టించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేయగా, ఛేజింగ్‌కు దిగిన రోహిత్‌ సేన అలవోకగా విజయం సాధించింది. ఐదు వికెట్ల తేడాతో ప్రత్యర్థి జట్టును మట్టికరిపించి టైటిల్‌ను నిలబెట్టుకుంది. 

ఇక ఈ మ్యాచ్‌లో నంబర్‌ 4 ఆటగాడిగా మైదానంలో దిగిన 22 ఏళ్ల ఇషాన్‌ కిషన్‌ 19 బంతుల్లో 33(నాటౌట్‌) పరుగులు చేశాడు , ఇందులో 3 ఫోర్లు, 1 సిక్స్‌ ఉన్నాయి. అంతేగాకుండా టోర్నీ మొత్తంలో ముంబై ఇండియన్స్‌ తరఫున అత్యధిక పరుగలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ నేపథ్యంలో ఎమ్‌ఎస్‌కే ప్రసాద్‌ ఇషాన్‌ గురించి ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించాడు. డైనమైట్‌లా దూసుకువచ్చిన అతడిని చూస్తే ముచ్చటేసింది. ఓపెనింగ్‌ ఇన్నింగ్స్‌తో పాటు నంబర్‌ 4 ప్లేస్‌లోనూ బ్యాట్స్‌మెన్‌గానూ ఆకట్టుకున్నాడు. జట్టు అవసరాలకు అనుగుణంగా తనను తాను మలచుకోవడం చూస్తుంటే త్వరలోనే జాతీయ జట్టులో చోటు సంపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి.(చదవండి: పంత్‌ ఎన్నటికీ ధోని కాలేడు: గంభీర్‌ )

టీ20, వన్డేల్లో వికెట్‌కీపర్‌- బ్యాట్స్‌మెన్‌ స్థానానికి అతడో గట్టి పోటీదారు అవుతాడు. ఐపీఎల్‌ మాదిరి ప్రదర్శన కొనసాగిస్తే నేషనల్‌ స్వ్యాడ్‌లోకి అతడికి స్వాగతం లభిస్తుంది’’అని పేర్కొన్నాడు. కాగా టీమిండియా మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ సైతం ఇషాన్‌ కిషన్‌పై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. తన కెప్టెన్సీలో అండర్‌ 19 మ్యాచ్‌లు ఆడిన రిషభ్‌ పంత్‌తో ఇషాన్‌ కిషన్‌కు పోటీ ఆసక్తికరంగా ఉంటుందని, కొన్నాళ్ల క్రితం ‘స్టార్‌’గా వెలుగొందిన పంత్‌ను రీప్లేస్‌ చేసే అవకాశాలు లేకపోలేదని అభిప్రాయపడ్డాడు. కాగా టీమిండియా మాజీ సారథి, వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ ధోని వారసుడిగా నీరాజనాలు అందుకున్న పంత్‌, గత కొంతకాలంగా మెరుగ్గా  ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వికెట్‌ కీపర్‌ స్థానాన్ని కేఎల్‌ రాహుల్‌ భర్తీ చేయడంతో అతడికి అవకాశాలు సన్నగిల్లాయి. అదే విధంగా సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌ వంటి ఆటగాళ్లు ఐపీఎల్‌లో‌ మెరుగ్గా రాణించి తమను తాము నిరూపించుకున్న నేపథ్యంలో 23 ఏళ్ల పంత్‌కు వారిద్దరి వల్ల గట్టిపోటీ ఎదురుకాబోతుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.(చదవండి: ‘సంజూ గ్రేట్‌.. పంత్‌ నువ్వు హల్వా, పూరీ తిను’)

మరిన్ని వార్తలు