‘కింగ్స్‌’ ఖేల్‌ ఖతమ్‌!

24 Oct, 2020 04:53 IST|Sakshi

ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి చెన్నై నిష్క్రమణ

ఐపీఎల్‌లో ఎనిమిదో ఓటమి

10 వికెట్లతో ముంబై ఇండియన్స్‌ ఘన విజయం

ట్రెంట్‌ బౌల్ట్‌ సూపర్‌ బౌలింగ్‌ (4/18)

ఐపీఎల్‌లో మూడుసార్లు విజేతగా నిలిచిన జట్టు, ఐదుసార్లు రన్నరప్, బరిలోకి దిగిన పది సీజన్లలో ప్రతీసారి కనీసం ప్లే ఆఫ్స్‌కు చేరిన ఘనత... లీగ్‌లో అద్భుత రికార్డు ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్రదర్శన పాతాళానికి చేరింది. ఇంతకంటే దిగువకు పడిపోవడానికి ఇంకా ఏమీ లేదన్నట్లుగా సాగిన ఆ జట్టు ఆటతో మరో పరాభవం దరిచేరింది. ఫలితంగా ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారి ధోని సేన అవమానకర రీతిలో
నిష్క్రమించనుంది. 11 మ్యాచ్‌లలో ఎనిమిదో ఓటమిని ఎదుర్కొన్న ఆ జట్టు ఇక ముందుకు వెళ్లేందుకు అన్ని దారులు మూసుకుపోయాయి.

ముంబైతో జరిగిన మ్యాచ్‌లో మరింత పేలవ ప్రదర్శనతో 114 పరుగులే నమోదు చేసిన జట్టు, ఈ లీగ్‌ చరిత్రలో తొలిసారి 10 వికెట్ల పరాజయాన్ని చవిచూసింది. 3 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన స్థితి నుంచి స్యామ్‌  కరన్‌ పట్టుదలతో స్కోరు వంద పరుగులు దాటినా అది ఏమాత్రం సరిపోలేదు. ఇషాన్, డికాక్‌ ఆడుతూ పాడుతూ మరో 46 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేర్చడంతో ముంబై మళ్లీ అగ్రస్థానానికి దూసుకుపోయింది. పనిలో పనిగా సీజన్‌ తొలి మ్యాచ్‌లో తమకు ఎదురైన ఓటమికి డిఫెండింగ్‌ చాంపియన్‌ బదులు తీర్చుకుంది.   

షార్జా: డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్‌–2020లో తమ జోరును కొనసాగిస్తోంది. శుక్రవారం పూర్తి ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో ముంబై 10 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్లకు 114 పరుగులు చేసింది. స్యామ్‌ కరన్‌ (47 బంతుల్లో 52; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీ మినహా అంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ మ్యాచ్‌’ ట్రెంట్‌ బౌల్ట్‌ (4/18) ప్రత్యర్థిని కుప్పకూల్చాడు. అనంతరం ముంబై 12.2 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 116 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌ (37 బంతుల్లో 68 నాటౌట్‌; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), డికాక్‌ (37 బంతుల్లో 46 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయంగా నిలిచారు.  

టపటపా...
ఒక వైపు నుంచి బౌల్ట్, మరోవైపు నుంచి బుమ్రా పదునైన బంతులతో విరుచుకుపడుతుంటే చెన్నై బ్యాట్స్‌మెన్‌ నిస్సహాయులుగా కనిపించారు. డగౌట్‌ చేరడానికి వారంతా ఒకరితో మరొకరు పోటీ పడినట్లు కనిపించింది. తీవ్ర ఒత్తిడి మధ్య అవకాశం దక్కించుకున్న యువ ఆటగాళ్లు రుతురాజ్‌ గైక్వాడ్‌ (0), జగదీశన్‌ (0) డకౌట్‌ కాగా, అనుభవజ్ఞులు అంబటి రాయుడు (2), డుప్లెసిస్‌ (1) కూడా చేతులెత్తేశారు. అనవసరపు షాట్‌కు ప్రయత్నించి జడేజా (7) మిడ్‌వికెట్‌లో క్యాచ్‌ ఇవ్వడంతో పవర్‌ప్లేలోనే చెన్నై సగం వికెట్లు చేజార్చుకుంది. 6 ఓవర్లలో జట్టు స్కోరు 24/5 మాత్రమే. ఐపీఎల్‌ కెరీర్‌లో రెండోసారి మాత్రమే రెండో ఓవర్లోనే బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చిన ఎమ్మెస్‌ ధోని (16 బంతుల్లో 16; 2 ఫోర్లు, 1 సిక్స్‌)... బుమ్రా ఓవర్లో రెండు ఫోర్లు కొట్టినా, ఎక్కువసేపు నిలవలేదు. లెగ్‌స్పిన్నర్‌ రాహుల్‌ చహర్‌ చక్కటి బంతితో ధోని ఆటకట్టించాడు.   

అతనొక్కడే...
సీజన్‌ మొత్తంలో సీఎస్‌కే గురించి చెప్పుకోవాల్సిన అంశం ఏదైనా ఉందంటే అతని స్యామ్‌ కరన్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన గురించే. తొలి మ్యాచ్‌ నుంచి తనకు ఎలాంటి బాధ్యత ఇచ్చినా, ఏ స్థాయిలో బ్యాటింగ్‌ చేయించినా, ఎప్పుడు బౌలింగ్‌ అవకాశం ఇచ్చినా సత్తా చాటిన 22 ఏళ్ల కరన్‌ మరోసారి తన విలువను ప్రదర్శించాడు. ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌ మూడో బంతికి క్రీజ్‌లోకి వచ్చిన అతను బౌలర్లందరినీ సమర్థంగా ఎదుర్కొంటూ చివరి బంతి వరకు పట్టుదలగా నిలిచి పరుగులు రాబట్టాడు. రాహుల్‌ చహర్, కూల్టర్‌నైల్‌ వరుస ఓవర్లలో ఒక్కో సిక్స్‌ కొట్టి అతను జోరును ప్రదర్శించాడు.

బౌల్ట్‌ వేసిన 20వ ఓవర్లో కరన్‌ బ్యాటింగ్‌ హైలైట్‌గా నిలిచింది. అప్పటివరకు 3 ఓవర్లలో 5 పరుగులే ఇచ్చిన బౌల్ట్‌ గణాంకాలు ఈ ఓవర్‌తో మారిపోయాయి. ఈ ఓవర్లో మూడు ఫోర్లు బాదిన కరన్‌ 46 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆఖరి బంతికి అద్భుత యార్కర్‌తో కరన్‌ను బౌల్డ్‌ చేసి బౌల్ట్‌ సంతృప్తి చెందాడు. కరన్‌కు ఇమ్రాన్‌ తాహిర్‌ (13 నాటౌట్‌) సహకరించడంతో స్కోరు 100 పరుగులు దాటింది. వీరిద్దరు 31 బంతుల్లో 43 పరుగులు జోడించారు. ఐపీఎల్‌లో తొమ్మిదో వికెట్‌కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం.
అలవోకగా...
ఛేదనలో ముంబైకి ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. ఇషాన్‌ కిషన్, డికాక్‌లను చెన్నై బౌలర్లు కట్టడి చేయలేకపోయారు. స్వేచ్ఛగా ఆడిన ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ చకచకా పరుగులు రాబట్టారు. జడేజా ఓవర్లో వరుసగా 2 భారీ సిక్సర్లు కొట్టిన కిషన్‌ 29 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత మ్యాచ్‌ ముగియడానికి ఎక్కువసేపు పట్టలేదు. ఎడమకాలి కండరాల గాయంతో ముంబై జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈ మ్యాచ్‌లో ఆడలేదు. అతని స్థానంలో కీరన్‌ పొలార్డ్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

స్కోరు వివరాలు
చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ (ఎల్బీ) (బి) బౌల్ట్‌ 0; డుప్లెసిస్‌ (సి) డికాక్‌ (బి) బౌల్ట్‌ 1; రాయుడు (సి) డికాక్‌ (బి) బుమ్రా 2; జగదీశన్‌ (సి) సూర్యకుమార్‌ (బి) బుమ్రా 0; ధోని (సి) డికాక్‌ (బి) రాహుల్‌ చహర్‌ 16; జడేజా (సి) కృనాల్‌ (బి) బౌల్ట్‌ 7; స్యామ్‌ కరన్‌ (బి) బౌల్ట్‌ 52; దీపక్‌ చహర్‌ (స్టంప్డ్‌) డికాక్‌ (బి) రాహుల్‌ చహర్‌ 0; శార్దుల్‌ (సి) సూర్యకుమార్‌ (బి) కూల్టర్‌నైల్‌ 11; తాహిర్‌ (నాటౌట్‌) 13; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 114.
వికెట్ల పతనం: 1–0; 2–3; 3–3; 4–3; 5–21; 6–30; 7–43; 8–71; 9–114.
బౌలింగ్‌: బౌల్ట్‌ 4–1–18–4; బుమ్రా 4–0–25–2; కృనాల్‌ 3–0–16–0; రాహుల్‌ చహర్‌ 4–0–22–2; కూల్టర్‌నైల్‌ 4–0–25–1; పొలార్డ్‌ 1–0–4–0.  

ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: డికాక్‌ (నాటౌట్‌) 46; ఇషాన్‌ కిషన్‌ (నాటౌట్‌) 68; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (12.2 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా) 116.  
బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 4–0–34–0; హాజల్‌వుడ్‌ 2–0–17–0; తాహిర్‌ 3–0–22–0; శార్దుల్‌ 2.2–0–26–0; జడేజా 1–0–15–0.  

మరిన్ని వార్తలు