IPL 2021, CSK vs MI: చెన్నైపై పొలార్డ్‌ పిడుగు

2 May, 2021 03:18 IST|Sakshi

ముంబై ఇండియన్స్‌ను గెలిపించిన బ్యాట్స్‌మన్‌

34 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 87 నాటౌట్‌

నాలుగు వికెట్లతో చెన్నై ఓటమి

మెరిసిన రాయుడు, ప్లెసిస్, అలీ

విజయ లక్ష్యం 219 పరుగులు... ప్రత్యర్థి చెన్నై జట్టు అంటే అంత సులువు కాదు. ఒక దశలో 10.2 ఓవర్లలో 138 పరుగులు చేయాలి. కానీ ఈ అసాధ్యాన్ని ఒకే ఒక్కడు సుసాధ్యం చేసి చూపించాడు. వీర విధ్వంసం ప్రదర్శించిన కీరన్‌ పొలార్డ్‌ తన మెరుపు బ్యాటింగ్‌తో చివరి వరకు నిలిచి ముంబై ఇండియన్స్‌ను గెలిపించాడు. అతని బ్యాటింగ్‌ జోరు ముందు వ్యూహాలు కానరాక చివరకు చెన్నై తలవంచింది. అంతకుముందు అంబటి రాయుడు చూపించిన మెరుపు ప్రదర్శన కూడా పొలార్డ్‌ జోరు ముందు చిన్నబోయింది.

న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై నాలుగు వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అంబటి రాయుడు (27 బంతుల్లో 72 నాటౌట్‌; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌ చేయగా... మొయిన్‌ అలీ (36 బంతుల్లో 58; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), ఫాఫ్‌ డు ప్లెసిస్‌ (28 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. డు ప్లెసిస్‌కు ఐపీఎల్‌లో ఇది వరుసగా నాలుగో అర్ధ సెంచరీ కావడం విశేషం. అనంతరం ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసి గెలించింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పొలార్డ్‌ (34 బంతుల్లో 87 నాటౌట్‌; 6 ఫోర్లు, 8 సిక్స్‌లు) అద్భుత ప్రదర్శన కనబర్చగా, కృనాల్‌ (23 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు.  

శుభారంభం...
భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబైకి శుభారంభం లభించింది. ఓపెనర్లు డి కాక్, రోహిత్‌ చకచకా పరుగులు సాధించారు. దీపక్‌ చహర్‌ వేసిన మూడో ఓవర్లో రోహిత్‌ వరుసగా రెండు ఫోర్లు కొట్టగా, డి కాక్‌ ఒక సిక్స్‌ బాదడంతో 15 పరుగులు వచ్చాయి. స్యామ్‌ కరన్‌ వేసిన తర్వాతి ఓవర్లో రోహిత్‌ మళ్లీ రెండు వరుస బౌండరీలు బాదాడు. పవర్‌ప్లేలో ముంబై 58 పరుగులు సాధించింది. అయితే 11 పరుగుల వ్యవధిలో రోహిత్, సూర్యకుమార్‌ (3), డి కాక్‌లను అవుట్‌ చేసి చెన్నై పైచేయి సాధించింది. గెలుపు కోసం 62 బంతుల్లో 138 పరుగులు చేయాల్సిన స్థితిలో ముంబై నిలిచింది.  

పొలార్డ్‌ విధ్వంసం...
గెలుపు బాధ్యతను తీసుకున్న ముంబై బ్యాట్స్‌మన్‌ పొలార్డ్‌ తనదైన తరహాలో చెలరేగిపోయాడు. జడేజా ఓవర్లో 3 సిక్స్‌లు బాదిన అతను ఇన్‌గిడి వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టాడు. శార్దుల్‌ ఓవర్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌ కొట్టడంతో మొత్తం 23 పరుగులు వచ్చాయి. అతనికి మరో ఎండ్‌లో కృనాల్‌ నుంచి తగిన సహకారం లభించింది. ఇన్‌గిడి ఓవర్లో కృనాల్‌ 2 ఫోర్లు, 1 సిక్స్‌ కొట్టడంతో ముంబై గెలుపు దిశగా సాగుతున్నట్లు అనిపించింది. అయితే స్యామ్‌ కరన్‌ చక్కటి బంతితో ఈ భాగస్వామ్యాన్ని (44 బంతుల్లో 89 పరుగులు) విడదీయడంతో సీఎస్‌కే ఊపిరి పీల్చుకుంది. అయితే చివరి వరకు నిలబడిన పొలార్డ్‌ జట్టును గెలిపించాడు.  

డుప్లెసిస్‌ క్యాచ్‌ మిస్‌...
చివరి 3 ఓవర్లలో మరింత డ్రామా సాగింది. శార్దుల్‌ వేసిన ఈ ఓవర్లో పొలార్డ్‌ వరుసగా 6, 4 బాదాడు. అయితే పొలార్డ్‌ వ్యక్తిగత స్కోరు 68 వద్ద లాంగాన్‌ వద్ద అతను ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడైన డు ప్లెసిస్‌ వదిలేశాడు. ఈ క్యాచ్‌ పట్టి ఉంటే మ్యాచ్‌ చెన్నై చేతుల్లోకి వచ్చేసేదేమో. 2 ఓవర్లలో 31 పరుగులు చేయాల్సిన స్థితిలో కరన్‌ బౌలింగ్‌లో తొలి రెండు బంతుల్లోనే హార్దిక్‌ పాండ్యా (7 బంతుల్లో 16; 2 సిక్స్‌లు) భారీ సిక్సర్లు కొట్టాడు. అయితే కరన్‌ చక్కటి బంతులతో హార్దిక్‌తో పాటు నీషమ్‌ (0)ను కూడా అవుట్‌ చేయడంతో సమీకరణం చివరి ఓవర్లో 16 బంతులకు చేరింది. ఇన్‌గిడి వేసిన ఈ ఓవర్లో తొలి బంతికి అవకాశం ఉన్నా సింగిల్‌కు నిరాకరించిన పొలార్డ్‌ తర్వాతి రెండు బంతులను ఫోర్లుగా మలిచాడు. నాలుగో బంతికీ సింగిల్‌ తీయని అతను ఐదో బంతికి భారీ సిక్సర్‌ కొట్టాడు. ఆఖరి బంతిని ఇన్‌గిడి బాగానే వేసినా... లాంగాన్‌ నుంచి ఫీల్డర్‌ బంతి విసిరే లోపు కావాల్సిన రెండో పరుగును పొలార్డ్‌ పూర్తి చేశాడు.  

సెంచరీ భాగస్వామ్యం...
అంతకుముందు చెన్నై ఇన్నింగ్స్‌ నాలుగో బంతికే రుతురాజ్‌ (4) అవుట్‌ కావడంతో తొలి వికెట్‌ కోల్పోయింది. అయితే అద్భుత ఫామ్‌లో ఉన్న డు ప్లెసిస్, అలీ చెలరేగుతూ ఒకరితో మరికరు పోటీ పడి వేగంగా పరుగులు సాధించారు. ధావల్‌ ఓవర్లో ప్లెసిస్‌ ఫోర్, సిక్స్‌ కొట్టగా, బౌల్ట్‌ వేసిన తర్వాతి ఓవర్లో అలీ వరుస బంతుల్లో 6, 4 బాదాడు. పవర్‌ప్లే ముగిసేసరికి చెన్నై స్కోరు 49 పరుగులకు చేరింది. ఆ తర్వాత రాహుల్‌ చహర్‌ ఓవర్లో వీరిద్దరు చెరో సిక్స్‌ కొట్టారు. నీషమ్‌ ఓవర్లో సిక్స్, 2 ఫోర్లు కొట్టిన అలీ 33 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బుమ్రా ఓవర్లో 17 పరుగులు రాబట్టిన ప్లెసిస్‌ 27 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ మార్క్‌ను చేరుకోవడం విశేషం. అయితే అలీని అవుట్‌ చేసి బుమ్రా ఈ భాగస్వామ్యాన్ని (61 బంతుల్లో 108 పరుగులు) విడదీయగా... తర్వాతి ఓవర్లోనే పొలార్డ్‌ వరుస బంతుల్లో ప్లెసిస్, రైనా (2)లను వెనక్కి పంపించాడు. ఈ దశలో సరిగ్గా 12 ఓవర్లలో చెన్నై స్కోరు 116 పరుగులు. అయితే రాయుడు విధ్వంసానికి ఆఖరి 8 ఓవర్లలో టీమ్‌ ఏకంగా 102 పరుగులు సాధించడం విశేషం.  

బుమ్రా 4–0–56–1
గత మ్యాచ్‌లో సూపర్‌ స్పెల్‌తో రాజస్తాన్‌ను కట్టడి చేసిన టాప్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు ఈ మ్యాచ్‌లో కలిసి రాలేదు. తన ఐపీఎల్‌లో కెరీర్‌లోనే అత్యంత చెత్త గణాంకాలను అతను ఈ మ్యాచ్‌లో నమోదు చేశాడు. బుమ్రా తొలి ఓవర్లోనే అలీ సిక్స్‌ బాదడంతో 8 పరుగులు వచ్చాయి. అతని రెండో ఓవర్లో తొలి మూడు బంతులకు ప్లెసిస్‌ 6, 6, 4 కొట్టాడు (ఓవర్లో మొత్తం పరుగులు 17). తన తర్వాతి ఓవర్లో రాయుడు దెబ్బకు అతను ఏకంగా 21 పరుగులు సమర్పించుకున్నాడు. బుమ్రా చివరి ఓవర్లో కూడా 10 పరుగులు వచ్చాయి.

రాయుడు వీరోచిత ఇన్నింగ్స్‌...
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు రాయుడు ప్రభావం చూపించలేదు. నాలుగు ఇన్నింగ్స్‌లలో 23, 0, 27, 14 పరుగులు మాత్రమే చేశాడు. అయితే ఆ లోటును తీరుస్తూ ఇక్కడ చెలరేగిపోయాడు. పొలార్డ్‌ బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టిన అనంతరం చహర్‌ ఓవర్లో స్క్వేర్‌ లెగ్‌ దిశగా కొట్టిన భారీ సిక్స్‌తో అతని జోరు మొదలైంది. ధావల్‌ ఓవర్లోనూ అతను వరుసగా రెండు సిక్స్‌లు బాదాడు. బుమ్రా ఓవర్లో ఎక్స్‌ట్రా కవర్‌ మీదుగా అతను కొట్టిన సిక్స్‌ ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇది నోబాల్‌ కావడంతో వచ్చిన ఫ్రీ హిట్‌ను కూడా రాయుడు బౌండరీకి తరలించాడు. బౌల్ట్‌ వేసిన తర్వాతి ఓవర్లో రాయుడు పండగ చేసుకున్నాడు. ఈ ఓవర్లో అతను 2 సిక్స్‌లు, ఫోర్‌ కొట్టాడు. ఈ క్రమంలో 20 బంతుల్లో అతని హాఫ్‌ సెంచరీ పూర్తయింది. ధావల్‌ వేసిన 20వ ఓవర్‌ చివరి రెండు బంతులను కూడా రాయుడు 6, 4 గా మలచడం విశేషం. మరోవైపు రవీంద్ర జడేజా (22 బంతుల్లో 22 నాటౌట్‌; 2 ఫోర్లు) మాత్రం తనదైన దూకుడు కనబర్చలేకపోయాడు. ఈ జంట ఐదో వికెట్‌కు అభేద్యంగా 56 బంతుల్లో 102 పరుగులు జత చేసింది.

స్కోరు వివరాలు
చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ (సి) హార్దిక్‌ (బి) బౌల్ట్‌ 4; డు ప్లెసిస్‌ (సి) బుమ్రా (బి) పొలార్డ్‌ 50; అలీ (సి) డి కాక్‌ (బి) బుమ్రా 58; రైనా (సి) కృనాల్‌ (బి) పొలార్డ్‌ 2; రాయుడు (నాటౌట్‌) 72; జడేజా (నాటౌట్‌) 22; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 218.
వికెట్ల పతనం: 1–4, 2–112, 3–116, 4–116.
బౌలింగ్‌: బౌల్ట్‌ 4–0–42–1, ధావల్‌ 4–0–48–0, బుమ్రా 4–0–56–1, రాహుల్‌ చహర్‌ 4–0–32–0, నీషమ్‌ 2–0–26–0, పొలార్డ్‌ 2–0–12–2.

ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: డి కాక్‌ (సి అండ్‌ బి) అలీ 38; రోహిత్‌ (సి) రుతురాజ్‌ (బి) శార్దుల్‌ 35; సూర్యకుమార్‌ (సి) ధోని (బి) జడేజా 3; కృనాల్‌ (ఎల్బీ) (బి) కరన్‌ 32; పొలార్డ్‌ (నాటౌట్‌) 87; హార్దిక్‌ (సి) డు ప్లెసిస్‌ (బి) కరన్‌ 16; నీషమ్‌ (సి) శార్దుల్‌ (బి) కరన్‌ 0; ధావల్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 219.
వికెట్ల పతనం: 1–71, 2–77, 3–81, 4–170, 5–202, 6–203.
బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 4–0–37–0, స్యామ్‌ కరన్‌ 4–0–34–3,  ఇన్‌గిడి 4–0–62–0, శార్దుల్‌ 4–0–56–1, జడేజా 3–0–29–1, మొయిన్‌ అలీ 1–0–1–1.

మరిన్ని వార్తలు