'స్మిత్‌ను పంపించాం.. స్టోక్స్‌ను వదులుకోలేం'

26 Jan, 2021 19:40 IST|Sakshi

జైపూర్‌: ఫిబ్రవరి 18న జ‌ర‌గ‌బోయే ఐపీఎల్ 2021 మినీ వేలానికి ఫ్రాంచైజీలు సిద్ధ‌మ‌వుతున్నాయి.ఇప్ప‌టికే రిటైన్‌, రిలీజ్‌ ఆటగాళ్ల లిస్టును ప్రకటించిన ఫ్రాంచైజీలు.. ఇప్పుడు ట్రేడింగ్‌ ద్వారా త‌మ‌కు కావాల్సిన ఆటగాళ్లను తీసుకుంటున్నాయి. అయితే ముంబై ఇండియన్స్‌ అభిమాని ఒకరు రాజస్థాన్‌ రాయల్స్ జట్టు ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ను ముంబై జట్టు‌కు ట్రేడింగ్‌ చేయాలని కోరాడు. ముంబై అభిమానికి రాజస్థాన్‌ తనదైన శైలిలో పంచ్ ఇచ్చింది.

విషయంలోకి వెళితే.. ముంబై ఇండియన్స్ అభిమాని దళపతి విగ్నేశ్వరన్.. బెన్‌ స్టోక్స్‌ను ముంబై జట్టు‌కు ట్రేడింగ్‌ చేయాలని రాజస్థాన్‌ రాయల్స్ జట్టును కోరాడు. అభిమాని ట్వీట్‌కు స్పందించిన రాజస్థాన్‌ ఫ్రాంచైజీ స్టోక్స్‌ను ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. దీనికి నో.. నో అంటూ ఒక ఎమోజీని రీ ట్వీట్‌ చేసింది. ఇప్పటికే ఆసీస్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ను వదిలేసుకున్న రాజస్తాన్‌ ఇప్పుడు స్టోక్స్‌ను కూడా వదిలేస్తే ఆ జట్టుకు మరింత నష్టం జరిగే ప్రమాదం ఉంది. చదవండి: ధోని దంపతులతో చిల్‌ అయిన పంత్‌

అయితే ముంబై ఇండియన్స్‌కు ముగ్గురు నాణ్యమైన ఆల్‌రౌండర్లు ఉన్న సంగతి తెలిసిందే. కీరన్ పొలార్డ్, హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా రూపంలో మ్యాచ్‌ విన్నర్లు ఉన్నారు. అలాంటప్పుడు ఆ జట్టు బెన్‌ స్టోక్స్‌ను కొనుగోలు చేసే అవసరం లేదు. ఇప్పటికే జట్టులో ఉన్న కొంతమంది బెంచ్‌కే పరిమితమవుతున్నారు. కరోనా కారణంగా ఐపీఎల్ 13వ సీజన్‌లో స్టోక్స్‌ అన్ని మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. టోర్నీకి ఆలస్యంగా రావడంతో 8 మ్యాచ్‌లే ఆడిన స్టోక్స్‌ 285 పరుగులు చేశాడు. ముంబైతో ఆడిన లీగ్‌ మ్యాచ్‌లో 107 పరుగులతో శతకం సాధించి జట్టును గెలిపించిన సంగతి తెలిసిందే.

అయితే ఐపీఎల్‌ 13వ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు 6 విజయాలు.. 8 ఓటములతో పాయింట్ల పట్టికలో ఆఖరిస్థానంలో నిలిచింది. స్మిత్‌ కెప్టెన్సీ నుంచి వైదొలగించి అతని స్థానంలో సంజూ శామ్సన్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. కాగా భారత్‌, ఇంగ్లండ్‌ల మధ్య ఫిబ్రవరి 5 నుంచి టెస్టు సిరీస్‌ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు లంక నుంచి నేరుగా ఇండియాకు రానుండగా.. బెన్ స్టోక్స్‌ ఇప్పటికే ఇండియాకు వచ్చి క్వారంటైన్‌లో ఉన్నాడు. ఇరు జట్ల మధ్య చెన్నై వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. చదవండి: బెయిర్‌ స్టో ప్రతీకారం.. కానీ ట్విస్ట్‌ ఏంటంటే

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు