MI Vs PBKS: వరుస పరాజయాల తర్వాత.. ముంబై ఎట్టకేలకు...

29 Sep, 2021 04:39 IST|Sakshi
హార్దిక్‌

పంజాబ్‌ కింగ్స్‌పై కీలక విజయం

6 వికెట్లతో గెలిచిన రోహిత్‌ సేన

రాణించిన పొలార్డ్, తివారి, హార్దిక్‌

అబుదాబి: వరుసగా మూడు పరాజయాల తర్వాత యూఏఈ గడ్డపై డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌కు తొలి విజయం దక్కింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆరంభంలో తడబడినా అనుభవజ్ఞులైన ఆటగాళ్లు రోహిత్‌ శర్మ బృందాన్ని గెలుపు తీరం దాటించారు. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై 6 వికెట్ల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. మార్క్‌రమ్‌ (29 బంతుల్లో 42; 6 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం ముంబై 19 ఓవర్లలో 4 వికెట్లకు 137 పరుగులు సాధించింది. సౌరభ్‌ తివారి (37 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్‌ పాండ్యా (30 బంతుల్లో 40 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌లతో జట్టును గెలిపించారు.  

రాణించిన మార్క్‌రమ్‌... 
47 బంతుల్లో 61 పరుగులు... ఐదో వికెట్‌కు మార్క్‌రమ్, దీపక్‌ హుడా (26 బంతుల్లో 28; 1 ఫోర్, 1 సిక్స్‌) భాగస్వామ్యమిది. మరీ దూకుడుగా ఆడకపోయినా సరే, వీరిద్దరి ఈ పార్ట్‌నర్‌షిప్‌ లేకపోతే పంజాబ్‌ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉండేది. 12 పరుగుల వ్యవధిలో నలుగురు కీలక బ్యాట్స్‌మెన్‌ వెనుదిరిగిన జట్టు ఇన్నింగ్స్‌ను వీరు నిలబెట్టారు. మయాంక్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన మన్‌దీప్‌ సింగ్‌ (15)ను కృనాల్‌ ఎల్బీగా అవుట్‌ చేయడంతో పంజాబ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. అయితే ఆపై ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పొలార్డ్‌ పెద్ద దెబ్బ కొట్టాడు. తాను వేసిన ఏకైక ఓవర్లో రెండో బంతికి క్రిస్‌ గేల్‌ (1)ను, నాలుగో బంతికి రాహుల్‌ (22 బంతుల్లో 21; 2 ఫోర్లు)ను అతను వెనక్కి పంపాడు. బుమ్రా వేసిన తర్వాతి ఓవర్లోనే పూరన్‌ (2) అవుటయ్యాడు. ఈ దశలో మార్క్‌రమ్, హుడా మంచి సమన్వయంతో ఆడారు. బౌల్ట్‌ ఓవర్లో మూడు ఫోర్లతో 15 పరుగులు రాబట్టి జోరు పెంచుతున్న దశలో మార్క్‌రమ్‌ను రాహుల్‌ చహర్‌ అవుట్‌ చేయగా, హుడా కూడా చివర్లో ధాటిగా ఆడే ప్రయత్నంలో వెనుదిరిగాడు. మార్క్‌రమ్‌ అవుటైన తర్వాత పంజాబ్‌ జట్టు 28 బంతులు ఆడినా... వాటిలో ఒక్క ఫోర్‌ కూడా రాలేదు!

ఛేదనలో ముంబై కూడా తడబడింది. యువ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ వరుస బంతుల్లో రోహిత్‌ శర్మ (8), సూర్యకుమార్‌ యాదవ్‌ (0)లను అవుట్‌ చేసి జట్టును దెబ్బ తీశాడు. అయితే డి కాక్‌ (29 బంతుల్లో 27; 2 ఫోర్లు), తివారి కలిసి జట్టును నడిపించారు. ముఖ్యంగా తివారి కొన్ని చక్కటి షాట్లతో తన జోరును ప్రదర్శించాడు. డి కాక్‌ను షమీ అవుట్‌ చేయడంతో క్రీజ్‌లోకి వచ్చిన హార్దిక్‌కు 7 పరుగుల వద్ద లైఫ్‌ లభించింది. పాయింట్‌లో అతను ఇచ్చిన క్యాచ్‌ను హర్‌ప్రీత్‌ వదిలేయడంతో బతికిపోయిన హార్దిక్‌ ఆ తర్వాత పట్టుదలను ప్రదర్శించాడు. తివారి వెనుదిరిగినా పొలార్డ్‌ (15 నాటౌట్‌)తో కలిసి హార్దిక్‌ మ్యాచ్‌ ముగించాడు. వీరిద్దరు 23 బంతుల్లోనే 45 పరుగులు జత చేశారు. షమీ వేసిన 19వ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌తో హార్దిక్‌ చెలరేగి జట్టును గెలిపించాడు.  

స్కోరు వివరాలు
పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) బుమ్రా (బి) పొలార్డ్‌ 21; మన్‌దీప్‌ (ఎల్బీ) (బి) కృనాల్‌ 15; గేల్‌ (సి) హార్దిక్‌ (బి) పొలార్డ్‌ 1; మార్క్‌రమ్‌ (బి) చహర్‌ 42; పూరన్‌ (ఎల్బీ) (బి) బుమ్రా 2;  హుడా (సి) పొలార్డ్‌ (బి) బుమ్రా 28; హర్‌ప్రీత్‌ (నాటౌట్‌) 14; ఎలిస్‌ (నాటౌట్‌) 6; ఎక్స్‌ట్రాలు 6, మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 135.  వికెట్ల పతనం: 1–36, 2–39, 3–41, 4–48, 5–109, 6–123. బౌలింగ్‌: కృనాల్‌ 4–0–24–1, బౌల్ట్‌ 3–0–30–0, బుమ్రా 4–0–24–2, కూల్టర్‌ నైల్‌ 4–0–19–0, పొలార్డ్‌ 1–0–8–2, చహర్‌ 4–0–27–1.

ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) మన్‌దీప్‌ (బి) బిష్ణోయ్‌ 8; డి కాక్‌ (బి) షమీ 27; సూర్యకుమార్‌ (బి) బిష్ణోయ్‌ 0; తివారి (సి) రాహుల్‌ (బి) ఎలిస్‌ 45; హార్దిక్‌ (నాటౌట్‌) 40; పొలార్డ్‌ (నాటౌట్‌) 15; ఎక్స్‌ట్రాలు 2, మొత్తం (19 ఓవర్లలో 4 వికెట్లకు) 137 వికెట్ల పతనం: 1–16, 2–16, 3–61, 4–92. బౌలింగ్‌: మార్క్‌రమ్‌ 3–0–18–0, షమీ 4–0–42–1, అర్ష్‌దీప్‌ 4–0–29–0, రవి బిష్ణోయ్‌ 4–0–25–2, ఎలిస్‌ 3–0–12–1, హర్‌ప్రీత్‌ 1–0–11–0. 

మరిన్ని వార్తలు