Rohit Sharma: అనూహ్య పరిస్థితుల్లో సారథిగా.. కెప్టెన్‌గా పదేళ్లు.. ఏకంగా ఐదు ట్రోఫీలతో! ఇంతకంటే ఏం కావాలి? వీడియో వైరల్‌

30 Apr, 2023 14:45 IST|Sakshi
ఐపీఎల్‌ ట్రోఫీలతో రోహిత్‌ శర్మ (PC: MI)

Rohit Sharma 10 years as captain in IPL: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌ ఎవరంటే.. టక్కున గుర్తొచ్చే పేరు రోహిత్‌ శర్మ. తప్పనిసరి పరిస్థితుల్లో 2013 సీజన్‌ మధ్యలోనే ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్‌ నుంచి ముంబై ఇండియన్స్‌ పగ్గాలు చేపట్టాడు రోహిత్‌. జట్టును విజయపథంలో నడిపి.. అదే ఏడాది  చాంపియన్‌గా నిలిపి సారథిగా సత్తా చాటాడు.

ఏకైక కెప్టెన్‌
ఆ తర్వాత అతడు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 2015, 2017, 2019, 2020లో ముంబైకి ట్రోఫీలు అందించాడు. మొత్తంగా ఐదుసార్లు టైటిల్‌ గెలిచి.. ఐపీఎల్‌లో ఇప్పటిదాకా అత్యధిక సార్లు జట్టును విజేతగా నిలిపిన కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు. 

ధోని తర్వాత
అదే విధంగా రోహిత్‌ సారథ్యంలో ముంబై ఇండియన్స్‌ ఇప్పటి వరకు ఆరుసార్లు ప్లే ఆఫ్స్‌ చేరింది. ఇప్పటిదాకా ముంబై కెప్టెన్‌గా 149 మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌ శర్మ.. వాటిలో 81 విజయాలు సాధించాడు. ధోని(128 విజయాలు) తర్వాత ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన రెండో సారథి రోహిత్‌.

ప్రత్యేక వీడియో సందేశం
ఇక ఆదివారం 36వ వసంతంలో అడుగుపెట్టిన రోహిత్‌ శర్మ.. ముంబై ఇండియన్స్‌ సారథిగా పదేళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా.. ముంబై ఫ్రాంఛైజీ ప్రత్యేక వీడియోతో ఈ సంబరాలను సెలబ్రేట్‌ చేస్తోంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్‌ స్టార్లు సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, తిలక్‌ వర్మ సహా టిమ్‌ డేవిడ్‌, జేసన్‌ తదతరులు రోహిత్‌ ఘనతలను ప్రస్తావిస్తూ అతడిని విష్‌ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇంతకంటే ఏం కావాలి
పదేళ్లుగా ఒకే ఫ్రాంఛైజీకి కెప్టెన్‌గా కొనసాగుతూ.. అందులో ఐదుసార్లు ట్రోఫీ గెలవడం అంటే మామూలు విషయం కాదంటూ సూర్య.. హిట్‌మ్యాన్‌ను ఆకాశానికెత్తాడు. రోహిత్‌ కారణంగా ముంబై ఇండియన్స్‌ దేదీప్యమానంగా వెలిగిపోతోందని... అతడి కెప్టెన్సీలో ఆడటం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశాడు. మిగతా వాళ్లు సైతం సారథిగా రోహిత్‌ గొప్పతనాన్ని వర్ణిస్తూ తమ కెప్టెన్‌పై ప్రేమను చాటుకున్నారు.

రెండేళ్లుగా వైఫల్యాలు
ఇదిలా ఉంటే.. గతేడాది దారుణ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో చివరిస్థానానికి పరిమితమైన ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్‌-2023లో ఇప్పటి వరకు ఆడిన ఏడింటిలో మూడు మాత్రమే గెలిచి తొమ్మిదోస్థానంలో కొనసాగుతోంది. ఆదివారం వాంఖడే వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌తో తమ తదుపరి మ్యాచ్‌లో ముంబై తలపడనుంది. ఈ మ్యాచ్‌ను టీమిండియా సారథి రోహిత్‌ శర్మకు అంకితమిస్తున్నట్లు ముంబై ఫ్రాంఛైజీ పేర్కొంది.

చదవండి: ఏంటి బ్రో టెస్టు మ్యాచ్‌ అనుకున్నావా.. జట్టులో ఇంకా ఎవరూ లేరా? 

A post shared by Mumbai Indians (@mumbaiindians)

మరిన్ని వార్తలు