రాబిన్‌ ఊతప్ప ఔట్‌

6 Oct, 2020 19:14 IST|Sakshi

అబుదాబి:  ఈ ఐపీఎల్‌ సీజన్‌లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. ముందుగా బ్యాటింగ్‌ చేసేందుకు మొగ్గుచూపాడు. ఇప్పటివరకూ ముంబై ఇండియన్స్‌ ఐదు మ్యాచ్‌లు ఆడి మూడింట విజయం సాధించగా, ఇక రాజస్తాన్‌ రాయల్స్‌ నాలుగు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది. బ్యాటింగ్‌ వైఫల్యం కారణంగా రాజస్తాన్‌ రాయల్స్‌ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడింది. ఓవరాల్‌గా ఇరు జట్ల మధ్య 22 మ్యాచ్‌లు జరగ్గా అందులో ముంబై-రాజస్తాన్‌లు తలో 11విజయాలు సాధించి సమంగా ఉ‍న్నాయి. దాదాపు ఇరు జట్లు సమాన బలంతో ఉండటంతో ఆసక్తికర పోరు జరగవచ్చు.(చదవండి: ‘ఆ స్పిన్నర్‌ గురించే ఎక్కువ మాట్లాడాలి’)

ముంబై జట్టులో డీకాక్‌, రోహిత్‌ శర్మ, పొలార్డ్‌, హార్దిక్‌ పాండ్యా, ఇషాన్‌ కిషన్‌లు బ్యాటింగ్‌కు ప్రధాన బలంగా కాగా, బౌలింగ్‌లో ట్రెంట్‌ బౌల్ట్‌, బుమ్రా, రాహుల్‌ చహర్‌లు కీలకం. మరొకవైపు రాజస్తాన్‌ జట్టులో స్టీవ్‌ స్మిత్‌, సంజూ శాంసన్‌, జోస్‌ బట్లర్‌లే బ్యాటింగ్‌ బలం కాగా, బౌలింగ్‌లో ఆర్చర్‌, రాజ్‌పుత్‌లు అండగా ఉన్నారు. పటిష్టంగా ఉన్న ముంబైపై గెలవాలంటే రాజస్తాన్‌ అన్ని విభాగాల్లోనూ ఆకట్టుకోవాలి. ఏమాత్రం తేడా వచ్చినా రాజస్తాన్‌కు మరో పరాజయం తప్పదు. ఈమ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఎటువంటి మార్పులు లేకుంగా గత మ్యాచ్‌ జట్టుతోనే దిగుతోంది. ఇక రాజస్తాన్‌ మూడు మార్పులు చేసింది. ఊతప్ప, ఉనాద్కత్‌, రియాన్‌ పరాగ్‌లకు ఉద్వాసన పలికిన రాజస్తాన్‌..  యశస్వి జైశ్వాల్‌, రాజ్‌పుత్‌, కార్తీక్‌ త్యాగిలను జట్టులోకి తీసుకుంది.

రోహిత్‌ వర్సెస్‌ ఆర్చర్‌
ఈ సీజన్‌లో రోహిత్‌ శర్మ 176 పరుగులు సాధించాడు. కానీ పూర్తిస్థాయి ప్రదర్శన ఇంకా రోహిత్‌ నుంచి రాలేదు. ఈ మ్యాచ్‌లో మరింత నిలకడగా ఆడాలనే లక్ష్యంతో రోహిత్‌ బరిలోకి దిగుతున్నాడు. రోహిత్‌ తొలి పది ఓవర్ల వరకూ ఉంటే ముంబై భారీ స్కోరుకు బాటలు పడుతుంది. ఓవరాల్‌గా 193 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌.. 5,074 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 38 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌లో రోహిత్‌ స్టైక్‌రేట్‌ 131. 24గా ఉంది. ఇక రాజస్తాన్‌ ప్రధాన బౌలింగ్‌ ఆయుధం జోఫ్రా ఆర్చర్‌ గత నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు వికెట్లు తీశాడు. బౌలింగ్‌లో అతని ఎకానమీ 6.75గా ఉంది. ఆరంభంలో బ్యాట్స్‌మన్‌పై ఒత్తిడి పెంచే ఆర్చర్‌.. రోహిత్‌కు ఎలా బౌలింగ్‌ చేస్తాడో చూడాలి.(చదవండి: భువీ స్థానంలో పృథ్వీ రాజ్‌ యర్రా)

ముంబై ఇండియన్స్‌  
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), డీకాక్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్యా, కీరోన్‌ పొలార్డ్‌, కృనాల్‌ పాండ్యా, జేమ్స్‌ పాటిన్‌సన్‌, రాహుల్‌ చాహర్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, బుమ్రా

రాజస్తాన్‌ రాయల్స్‌
స్టీవ్‌ స్మిత్‌(కెప్టెన్‌), జోస్‌ బట్లర్‌, సంజూ శాంసన్‌, యశస్వి జైశ్వాల్‌, రాహుల్‌ తెవాటియా, టామ్‌ కరాన్‌, అన్‌కిత్‌ రాజ్‌పుత్‌, శ్రేయస్‌ గోపాల్‌, జోఫ్రా ఆర్చర్‌, మహిపాల్‌ లామ్రోర్‌, కార్తీక్‌ త్యాగి

మరిన్ని వార్తలు