ముంబైతో మ్యాచ్‌కు భువీ దూరం

4 Oct, 2020 15:11 IST|Sakshi

షార్జా : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో నేడు ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య షార్జా వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. వరుసగా రెండు విజయాలు సాధించిన సన్‌రైజర్స్.. ఈ మ్యాచ్‌లో ఆత్మవిశ్వాసంతో బరిలో దిగనుంది. మరోవైపు ఓ మ్యాచ్‌లో ఓడి.. మరో మ్యాచ్‌లో గెలుస్తూ.. రెండు విజయాలు సాధించిన ముంబై ఇండియన్స్ ఎస్‌ఆర్‌హెచ్‌పై గెలవాలనే కసితో బరిలో దిగనుంది. ఇప్పటి వరకూ ఇరు జట్లు దుబాయ్, అబుదాబిల్లో మాత్రమే మ్యాచ్‌లు ఆడాయి. కాగా తొలిసారి షార్జాలో ఆడబోతున్నాయి. కాగా టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌ బ్యాటింగ్‌ ఏంచుకుంది.

ఇరు జట్ల బలబలాలు
రోహిత్ శర్మ, పొలార్డ్, డికాక్‌, పాండ్య, ఇషాన్ కిషన్ లాంటి హిట్టర్లతో ముంబై బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. చిన్న స్టేడియంలో ముంబై ఇండియన్స్ సిక్సర్ల మోత మోగించే అవకాశం ఉంది. ముంబై బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్‌‌లకు సన్‌రైజర్స్‌పై పెద్దగా చెప్పుకునే రికార్డేం లేదు. గతంలో జరిగిన మ్యాచ్‌ల్లో పొలార్డ్, పాండ్యాలను రషీద్ ఖాన్ నిలువరించగా.. కాగా పొలార్డ్‌కు 22 బంతులేసిన భువీ అతన్ని 3 సార్లు ఔట్ చేశాడు. బౌలింగ్‌లో బుమ్రా, బౌల్ట్‌, రాహుల్‌ చాహర్‌లతో ముంబై పటిష్టంగానే ఉంది.

ఇక సన్‌రైజర్స్‌ విషయానికి వస్తే వార్నర్‌ టచ్‌లోనే కనిపిస్తున్నా భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోతున్నాడు.  బెయిర్‌ స్టో తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. మనీష్‌ పాండే, కేన్‌ విలియమ్సన్‌లు తమ ఫామ్‌ను కొనసాగిస్తే ముంబైకి కష్టాలు తప్పకపోవచ్చు.  చెన్నైతో మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న ప్రియమ్‌ గార్గ్‌, అభిషేక్‌ శర్మలు మరోసారి రాణిస్తే ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టుకు తిరుగుండదు. మరోవైపు చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ప్రధాన బౌలర్ భువీ గాయపడిన సంగతి తెలిసిందే. భువనేశ్వర్‌ గాయంతో మ్యాచ్‌కు దూరమవడంతో అతని స్థానంలో సందీప్‌ శర్మ, ఖలీల్‌ అహ్మద్‌ స్థానంలో సిద్దార్థ్‌ కౌల్‌ జట్టులోకి వచ్చారు.

ఇప్పటివరకు ఐపీఎల్‌లో ముంబై, సన్‌రైజర్స్‌లు 14 మ్యాచ్‌ల్లో తలపడగా.. చెరో ఏడుసార్లు చొప్పున గెలుపొందాయి. కాగా ఈ మ్యాచ్‌ ద్వారా పలువురు ఆటగాళ్లు పలు మైలురాళ్లను చేరుకోనున్నారు. ట్రెంట్‌ బౌల్ట్‌కిది 100వ టీ20 మ్యాచ్‌ కాగా ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌గా డేవిడ్‌ వార్నర్‌కు ఇది 50వ మ్యాచ్‌. మనీష్‌ పాండే ఐపీఎల్‌లో 3వేల పరుగుల మైలురాయిని చేరడానికి ఇంకా 40 పరుగులు దూరంలో ఉన్నాడు.

ముంబై ఇండియన్స్‌ జట్టు : రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), డీకాక్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్యా, కీరోన్‌ పొలార్డ్‌, కృనాల్‌ పాండ్యా, జేమ్స్‌ పాటిన్‌సన్‌, రాహుల్‌ చాహర్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, బుమ్రా

సన్‌రైజర్స్‌ జట్టు : డేవిడ్‌ వార్నర్‌(కెప్టెన్‌), జానీ బెయిర్‌ స్టో, మనీష్‌ పాండే, కేన్‌ విలియమ్సన్‌, అబ్దుల్‌ సామద్‌, అభిషేక్‌ శర్మ, ప్రియాం గార్గ్‌, రషీద్‌ ఖాన్‌, సందీప్‌ శర్మ, సిద్ధార్థ్‌ కౌల్‌, టి. నటరాజన్‌

>
మరిన్ని వార్తలు