వారెవ్వా ముంబై.. వాటే బ్యాటింగ్‌

1 Oct, 2020 21:27 IST|Sakshi

అబుదాబి: కింగ్స్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 192 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ముంబై ఇండియన్స్‌ బ్యాటింగ్‌లో రోహిత్‌ శర్మ, పొలార్డ్‌, హార్దిక్‌లు రాణించడంతో ముంబై బోర్డుపై భారీ స్కోరును ఉంచింది. రోహిత్‌(70; 45 బంతుల్లో 8 ఫోర్లు, 3సిక్స్‌లు), పొలార్డ్‌(47 నాటౌట్‌; 20 బంతుల్లో 3 ఫోర్లు, 4సిక్స్‌లు), హార్దిక్‌ పాండ్యా( 30 నాటౌట్‌; 11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు బ్యాటింగ్‌లో ఆకట్టుకున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి కింగ్స్‌ పంజాబ్‌ ముందుగా ఫీల్డింగ్‌ తీసుకోవడంతో ముంబై బ్యాటింగ్‌కు దిగింది.  ముంబై బ్యాటింగ్‌ను ఎ‍ప్పటిలాగే రోహిత్‌-డీకాక్‌లు ఆరంభించారు. 

కాగా, తొలి ఓవర్‌లో ముంబైకు షాక్‌ తగిలింది. డీకాక్‌ పరుగులేమీ చేయకుండా కాట్రెల్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు.అనంతరం సూర్యకుమార్‌ యాదవ్‌(10) రనౌట్‌ అయ్యాడు. దాంతో 21 పరుగులకే ముంబై రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తరుణంలో  ఇషాన్‌ కిషన్‌(28)తో కలిసి రోహిత్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు.  ఈ జోడి 62 పరుగుల జోడించిన తర్వాత గౌతమ్‌ బౌలింగ్‌లో ఇషాన్‌ కిషన్‌ ఔటయ్యాడు. ఇక స్లాగ్‌ ఓవర్లలో రోహిత్‌-పొలార్డ్‌లు బ్యాట్‌ ఝుళిపించడంతో పాటు హార్దిక్‌ కూడా ఆకట్టుకోవడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. 15 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసిన ముంబై.. మరో ఐదు ఓవర్లలో 89 పరుగులు చేసి వికెట్‌ను మాత్రమే కోల్పోయింది. గౌతమ్‌ వేసిన చివరి ఓవర్‌లో 25 పరుగులు రాగా, పొలార్డ్‌ హ్యాట్రిక్‌ సిక్స్‌లు కొట్టాడు. తొలి 10 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 62 పరుగులు సాధించిన ముంబై మ్యాచ్‌ ముగిసేసరికి సాధారణ స్కోరుకే పరిమితం అవుతుందనే ఆశించిన తరుణంలో బోర్డుపై 190పరుగులకు పైగా మార్కును ఉంచడం విశేషం. కింగ్స్‌ బౌలర్లలో కాట్రెల్‌, షమీ, గౌతమ్‌లు తలో వికెట్‌ తీశారు.
 

మరిన్ని వార్తలు