రిటైర్మెంట్‌ ప్రకటించిన టీమిండియా స్టార్‌ క్రికెటర్‌

30 Jan, 2023 16:24 IST|Sakshi

Murali Vijay Announces Retirement: టీమిండియా వెటరన్‌ ఓపెనింగ్‌ బ్యాటర్‌, తమిళనాడు క్రికెటర్‌ మురళి విజయ్‌.. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నట్లు ఇవాళ (జనవరి 30) ప్రకటించాడు. మురళి విజయ్‌ తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ట్విటర్‌ ద్వారా వెల్లడించాడు. రిటైర్మంట్‌ నోట్‌లో విజయ్‌ తనకు సహకరించిన వారందికీ ధన్యవాదాలు తెలిపాడు. 16 ఏళ్ల (2002-2018) పాటు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించడం గౌరవంగా భావిస్తున్నాని విజయ్‌ పేర్కొన్నాడు.

తనకు అవకాశాలు కల్పించిన బీసీసీఐ, తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌, చెమ్‌ప్లాస్ట్‌ సన్మార్‌ ఫ్రాంచైజీల యజమాన్యాలకు విజయ్‌ కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే, తన టీమ్‌ మేట్స్‌, కోచెస్‌, మెంటార్స్‌, సపోర్టింగ్‌ స్టాఫ్‌లకు కూడా ధన్యవాదాలు తెలిపాడు. ముఖ్యంగా తన కెరీర్‌లో ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నప్పుడు అండగా నిలిచిన ఫ్యాన్స్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొన్నాడు. తనపై అన్‌ కండిషనల్‌ లవ్‌ చూపిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. తన సెకెండ్‌ ఇన్నింగ్స్‌ను క్రికెట్‌కు సంబంధించిన వ్యాపారంలో కొనసాగిస్తానని తెలిపాడు. 

38 ఏళ్ల మురళి విజయ్‌.. టీమిండియా తరఫున 61 టెస్ట్‌లు, 17 వన్డేలు, 9 టీ20లు ఆడాడు. టెస్ట్‌ల్లో 12 సెంచరీలు, 15 హాఫ్‌ సెంచరీల సాయంతో 3982 పరుగులు చేసిన విజయ్‌.. వన్డేల్లో ఒక హాఫ్‌ సెంచరీ సాయంతో 339 పరుగులు, టీ20ల్లో 169 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో 106 మ్యాచ్‌లు ఆడిన విజయ్‌.. 2 సెంచరీలు, 13 హాఫ్‌ సెంచరీల సాయంతో 2619 పరుగులు చేశాడు.

విజయ్‌ తన ఐపీఎల్‌ ప్రస్థానంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో పాటు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌‌, కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. అలాగే కౌంటీల్లో ఎసెక్స్‌, సోమర్‌సెట్‌ జట్ల తరఫున ఆడాడు. విజయ్‌కు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌తో పాటు లిస్ట్‌-ఏ క్రికెట్‌లోనూ మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. రిటైర్మెంట్‌ వయసుకు సంబంధించి విజయ్‌ ఇటీవలే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్‌ క్రికెట్‌లో 30 ఏళ్లు దాటితే 80 ఏళ్ల వృద్ధుడిలా చూస్తారని షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. ఈ ప్రకటన చేసిన రోజుల వ్యవధిలోనే విజయ్‌ తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ప్రకటించాడు.    


 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు