'క్షమించండి.. మళ్లీ రిపీట్‌ కానివ్వను'

16 Dec, 2020 08:55 IST|Sakshi

ఢాకా : బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ ముష్ఫికర్‌ రహీమ్‌ బంగబంధు టీ20 కప్‌లో సోమవారం జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సహచర ఆటగాడు నజుమ్‌ అహ్మద్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఒక జూనియర్‌ క్రికెటర్‌పై రహీమ్‌ ఇలా ప్రవర్తించడమేంటని పలువురు మాజీ, సీనియర్‌ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. రహీమ్‌ చర్యకు మ్యాచ్‌ రిఫరీ అతని ఫీజులో 25శాతం జరిమానా విధించాడు.తాజాగా రహీమ్‌ తాను చేసిన పనికి బాధపడుతున్నానని.. మళ్లీ ఇలాంటిది రిపీట్‌ కాకుండా చూసుకుంటాని ఫేస్‌బుక్‌ వేదికగా అభిమానులకు చెప్పుకొచ్చాడు. (చదవండి : కొట్టేస్తా... ఏమనుకున్నావ్‌!)

'మ్యాచ్‌ సందర్భంగా తోటి క్రికెటర్‌పై నేను చేసిన పనికి సిగ్గుపడుతున్నా. మ్యాచ్‌ ముగిసిన వెంటనే నజుమ్‌ అహ్మద్‌కు క్షమాపణ కోరాను. ఒక మనిషిగా నేను అలా  ప్రవర్తించడం తప్పు. అతన్ని కొట్టడానికి చేయి చూపించడం సరైనది కాదు. అందుకే నా చర్యను తప్పుబడుతూ  క్రికెట్‌ అభిమానులకు.. ఆరోజు మైదానంలో ఉన్న ప్రేక్షకులకు మరోసారి క్షమాపణలు కోరుతున్నా. ఇలాంటి ఘటన నానుంచి మళ్లీ పునరావృతం కావని మీకు ప్రామిస్‌ చేస్తున్నా.' అంటూ ఉద్వేగంతో పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో రహీమ్‌ జట్టు బెక్సింకో ఢాకా 9 పరుగులతో ఫార్చున్‌ బరిషల్‌పై నెగ్గి ప్లే ఆఫ్‌కు చేరింది. 

మరిన్ని వార్తలు