Shikhar Dhawan: వచ్చే ఏడాది వరల్డ్‌కప్‌లో ఆడడమే నా టార్గెట్‌: ధావన్‌

13 Aug, 2022 15:42 IST|Sakshi

టీమిండియా వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్ ప్రస్తుతం వన్డేలకు మాత్రమే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో ఆడాలనే తన కోరికను ధావన్‌ తాజాగా వ్యక్తం చేశాడు. ఇందుకోసం తన ఫిట్‌నెస్‌, ఆటపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ధావన్‌ తెలిపాడు. కాగా వచ్చే ఏడాది వన్డే వరల్ఢ్‌కప్‌ భారత్‌ వేదికగా జరగనుంది.

ధావన్‌ టైమ్స్‌ ఇండియాతో మాట్లాడుతూ.. "ఐసీసీ టోర్నీల్లో ఆడటం నాకు చాలా ఇష్టం. మెగా టోర్నీల్లో ఆడితే నాకు ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. నేను గతంలో చాలా ఐసీసీ టోర్నమెంట్‌లలో భాగమయ్యాను.  టీమిండియా జర్సీ ధరించిన ప్రతీ సారీ నా పై ఒత్తిడి ఉంటుంది.

కానీ అనుభవజ్ఞుడైన ఆటగాడిగా, ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. అదేవిధంగా జట్టు మేనేజ్‌మెంట్‌ కూడా నాకు చాలా సార్లు మద్దతుగా నిలిచింది. ఏ టోర్నమెంట్‌కైనా నా దృష్టి, సన్నద్దత ఒకే విధంగా ఉంటుంది. ప్రస్తుతం నా దృష్టి అంతా  వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌పైనే ఉంది.

అందుకోసం టీమిండియా తరపున వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నాను. రాబోయే మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన చేయాలి అనుకుంటున్నాను. వన్డే ప్రపంచకప్‌కు ముందు ఐపీఎల్‌ టోర్నీ కూడా జరగనుంది. అదే విధంగా దేశీవాళీ టోర్నీలో కూడా ఆడి, పూర్తి ఫిట్‌గా ఉండాలని అనుకుంటున్నాను" అతడు పేర్కొన్నాడు.

ధావన్‌ ఇటీవల ముగిసిన విండీస్‌తో వన్డే సిరీస్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతడి సారథ్యంలోని టీమిండియా మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది. అదే విధంగా త్వరలో జింబాబ్వేతో జరగునున్న వన్డే సిరీస్‌కు ధావన్‌ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ధావన్‌ తొలుత కెప్టెన్‌గా ఎంపికైనప్పటికీ.. రాహుల్‌ ఫిట్‌నెస్‌ సాధించడంతో తిరిగి అతడిని సారధిగా బీసీసీఐ నియమించింది.
చదవండి: Shikhar Dhawan: టీ20లకు పక్కనపెట్టారు కదా! సెలక్టర్లు ఏం ఆలోచిస్తారో మనకు తెలియదు!

మరిన్ని వార్తలు