Asia Cup: భారత క్రికెటర్‌ కాదు.. కోచ్‌? ఫిజియో? కానే కాదు.. ట్రోఫీ ఎత్తాడుగా! సచిన్‌, ద్రవిడ్‌ వల్ల

18 Sep, 2023 16:04 IST|Sakshi

Who's The Man Who Lifted Asia Cup Trophy?: మ్యాచ్‌కు వర్ష సూచన.. ఒకవేళ ఫలితం తేలకుంటే రిజర్వ్‌ డే వరకు ఆగాలా? ఏమో.. ఏదేమైనా ఈసారి టీమిండియా గెలవాల్సిందే..! కప్పు కొట్టాల్సిందే.. ఆసియా కప్‌-2023 ఫైనల్లో టీమిండియా- శ్రీలంక ఫైనల్‌కు ముందు సగటు అభిమాని మదిలో మెదిలిన భావాలు..

కానీ వరణుడు ‘కరుణించాడు’... కాస్త ఆలస్యమైనా మ్యాచ్‌ జరిగేందుకు వీలుగా తానే వెనక్కి వెళ్లిపోయాడు.. టాస్‌ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్‌కు రాగా.. టీమిండియా ఆటగాళ్లంతా మైదానంలో దిగారు..

ఆ తర్వాత ఏం జరిగిందో క్రికెట్‌ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా తొలి వికెట్‌ తీసి శుభారంభం అందించగా.. మరో ఫాస్ట్‌బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ లంక బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కకావికలం చేశాడు. ఏకంగా ఆరు వికెట్లతో అదరగొట్టాడు.

ఈ హైదారాబాదీ దెబ్బకు శ్రీలంక బ్యాటర్లు క్యూ కట్టగా.. హార్దిక్ పాండ్యా వచ్చి మిగిలిన మూడు వికెట్లు తీసి లాంఛనం పూర్తి చేశాడు. 51 పరుగుల లక్ష్యంతో బరిలోగి దిగిన టీమిండియా 6.1 ఓవర్లలోనే టార్గెట్‌ ఛేదించింది.

ఎనిమిదోసారి ఆసియా కప్‌ భారత్‌ కైవసమైంది. ఆటగాళ్లతో పాటు అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. ఇక ట్రోఫీ ప్రదానోత్సవం.. గత కొంతకాలంగా ఏదైనా సిరీస్‌ గెలిస్తే.. సెలబ్రేషన్స్‌​ సమయంలో జట్టులోకి కొత్తగా అడుగుపెట్టిన వాళ్లు.. లేదంటే అందరికంటే వయసులో చిన్నవాళ్లకు ట్రోఫీని అందజేయడం ఆనవాయితీగా వస్తోందన్న విషయం తెలిసిందే.

తిలక్‌ వర్మకే ఆ అదృష్టం
ఈసారి హైదరాబాదీ బ్యాటర్‌ 20 ఏళ్ల తిలక్‌ వర్మకు ఏకంగా ఆసియా కప్‌ రూపంలో ఆ అదృష్టం దక్కింది. ఆ తర్వాత వెంటనే మరో వ్యక్తి ట్రోఫీని ఎత్తాడు. ఫొటోలు క్లిక్‌మన్నాయి.. అతడు ఎవరు? టీమిండియా ప్లేయర్‌ కాదు.. అలా అని కోచ్‌ లేదంటే ఫిజియో.. వీళ్లెవరూ కాదు.. మరెవరు.. జట్టుకు సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తున్న వ్యక్తుల్లో అతి ముఖ్యమైనవాడు.

హి ఈజ్‌ రఘు రాఘవేంద్ర
అతడి పేరు రఘు రాఘవేంద్ర.. త్రో డౌన్‌ స్పెషలిస్టు. బ్యాటర్లు నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్నపుడు వాళ్లకు స్లింగర్‌ నుంచి బంతులు రిలీజ్‌ చేసేది ఇతడే. నిజానికి బౌలర్ల కంటే మన బ్యాటర్లు ఇతడినే ఎక్కువసార్లు నెట్స్‌లో ఎదుర్కొంటారు. 

బ్యాటర్ల స్టైల్‌ను బట్టి.. మైదానంలో వాళ్లు ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొనేందుకు సంసిద్ధం కావడంలో త్రో డౌన్‌ స్పెషలిస్టు కీలకంగా వ్యవహరిస్తాడు. కేవలం బ్యాటింగ్‌ మాత్రమే కాదు.. ఫీల్డింగ్‌ ప్రాక్టీస్‌లోనూ రఘుదే కీలక పాత్ర. అతడికి తోడుగా మరో ఇద్దరు త్రో డౌన్‌ స్పెషలిస్టులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

వాళ్లిద్దరి సిఫారసుతోనే!
అయితే, టీమిండియా మొట్టమొదటి త్రో డౌన్‌ స్పెషలిస్టు మాత్రం రఘు రాఘవేంద్రనే! టీమిండియా దిగ్గజాలు సచిన్‌ టెండుల్కర్‌, ప్రస్తుత హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సిఫారసుతో భారత జట్టుతో చేరాలన్న అతడి కోరిక నెరవేరింది.

ఈ క్రమంలో కర్ణాటకకు చెందిన రఘు 2011లో బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ సిబ్బందిలో ఒకరిగా అడుగుపెట్టాడు. సచిన్‌, ధోని వంటి బ్యాటర్లకు త్రో డౌన్స్‌ ఇవ్వటమే కాదు.. జట్టుకు అవసరమైనపుడు అన్నీ తానై వ్యవహరించడంలో రఘు ముందుంటాడు.

అన్నింట్లో ముందే ఉంటాడు
ఈ విషయాన్ని గతంలో టీమిండియా మాజీ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ తన ట్వీట్‌ ద్వారా వెల్లడించాడు. ‘‘టీమిండియాలో అత్యంత కఠిన శ్రమకోచ్చే రఘు. కేవలం త్రో డౌన్స్‌ ఇవ్వడమే కాదు.. మ్యాచ్‌ టిక్కెట్ల దగ్గర నుంచి హోటల్స్‌, లాజిస్టిక్స్‌, భోజనం.. ఇలా ఏ విషయాల్లోనైనా సాయానికి తానున్నాంటూ ముందుకు వస్తాడు’’ అని ప్రశంసలు కురిపించాడు.

ఇక టీమిండియాకు అతిపెద్ద చీర్‌ లీడర్‌ అయిన రఘు.. గతేడాది టీ20 వరల్డ్‌కప్‌ సందర్భంగా.. ఆటగాళ్లతో పాటు అభిమానుల మనసు గెలుచుకున్నాడు. టీమిండియా- బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ చూసిన వారికి ఈ సంగతి గుర్తుండే ఉంటుంది. 

షూస్‌ తుడుస్తూ.. మనసులు గెలిచాడు
లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లా బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో.. వర్షం పడింది. కాసేపటి తర్వాత వాన తగ్గుముఖం పట్టడంతో మళ్లీ ఆట మొదలుపెట్టగా.. అవుట్‌ ఫీల్డ్‌ కాస్త తడిగా ఉండటంతో టీమిండియా ప్లేయర్లు ఎక్కడ ఇబ్బంది పడతారోనని బ్రష్‌ పట్టుకుని రంగంలోకి దిగాడు రఘు.

ఫీల్డర్లు పట్టుజారి పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో.. బౌండరీ లైన్‌ దగ్గరికి వచ్చి.. వారి షూస్‌కు అంటిన మట్టిని బ్రష్‌తో క్లీన్‌చేస్తూ ఏ ఇబ్బంది కలగకుండా చూసుకున్నాడు. అప్పుడు అతడి ఫొటో నెట్టింట వైరల్‌ కాగా.. ప్రశంసల జల్లు కురిసింది.

తాజాగా ఆసియా కప్‌ విజయం నేపథ్యంలో టీమిండియా క్రికెటర్లు అతడికి ట్రోఫీ అందించి కృతజ్ఞతాభావం చాటుకోవడంతో పాటు సముచిత గౌరవం కల్పించడంతో మరోసారి ఇలా వార్తల్లోకెక్కాడు.

చదవండి: అంతా బాగానే ఉంది కానీ.. అప్పట్లో కోహ్లి, ద్రవిడ్‌: రోహిత్‌కు వార్నింగ్‌

మరిన్ని వార్తలు