N Jagadeesan: భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్న సీఎస్‌కే మాజీ ప్లేయర్‌.. తాజాగా మరో సెంచరీ

15 Dec, 2022 19:05 IST|Sakshi

Ranji Trohy 2022-23: విజయ్‌ హజారే ట్రోఫీ-2022 సీజన్‌లో వరుసగా 5 సెంచరీలు (114 నాటౌట్‌, 107, 168, 128, 277) బాది పలు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టిన తమిళనాడు విధ్వంసకర బ్యాటర్‌ ఎన్‌ జగదీశన్‌.. తన భీకర ఫామ్‌ను కొనసాగించాడు. రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో భాగంగా హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ సీఎస్‌కే మాజీ ప్లేయర్‌ మరోసారి జూలు విదిల్చాడు.

విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా అరుణాచల్‌ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 277 పరుగులు (141 బంతుల్లో 25 ఫోర్లు, 15 సిక్సర్లు) బాదిన జగదీశన్‌.. ఇవాళ హైదరాబాద్‌పై 97 బంతుల్లో 16 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 116 పరుగులు చేశాడు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో జగదీశన్‌కు ఇది ఐదో సెంచరీ. జగదీశన్‌ పార్ట్‌నర్‌, తమిళనాడు ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ (179), అపరాజిత్‌ (115) కూడా సెంచరీలతో కదం  తొక్కడంతో తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 510 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.

ఫలితంగా ఆ జట్టుకు 115 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన హైదరాబాద్‌ మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 87 పరుగులు వెనకంజతో ఉంది. అంతకుముందు తన్మయ్‌ అగర్వాల్‌ (135), మికిల్‌ జైస్వాల్‌ (137 నాటౌట్‌) శతకాలతో చెలరేగడంతో హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో 395 పరుగులకు ఆలౌటైంది. 
చదవండి: 5 సెంచరీలు బాదిన చిచ్చరపిడుగును వదులుకున్నామా.. ధోని పశ్చాత్తాపం

చదవండి: 38 బంతుల్లోనే సెంచరీ.. పలు ప్రపంచ రికార్డులు బద్ధలు

మరిన్ని వార్తలు