నాడో’ విధివిధానాలే పాటించనున్న ‘నాడా’ 

14 Aug, 2020 08:46 IST|Sakshi

యూఏఈతో ఒప్పందం కుదుర్చుకున్న జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ 

న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)కు ముందు క్రికెటర్ల డోప్‌ టెస్టు విధివిధానాలపై జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) స్పష్టతనిచ్చింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)కి చెందిన జాతీయ డోపింగ్‌ నిరోధక కమిటీ (నాడో)తో కలిసి క్రికెటర్ల శాంపుల్స్‌ సేకరిస్తామని నాడా తెలిపింది. నమూనాల సేకరణలో ‘నాడో’ విధివిధానాలనే (ఎస్‌ఓపీ) ఇరు దేశాల డోపింగ్‌ అధికారులు పాటించనున్నారు. ఐపీఎల్‌ సీజన్‌–13 సెప్టెంబర్‌ 19నుంచి నవంబర్‌ 10వరకు యూఏఈలోని దుబాయ్, అబుదాబి, షార్జా వేదికల్లో జరుగనుంది. ఈ నేపథ్యంలో తమ డోపింగ్‌ నియంత్రణ అధికారుల్ని (డీసీఓ) నాడా యూఏఈ పంపనుంది. అక్కడ వీరంతా వారం పాటు ఐసోలేషన్‌లో ఉండనున్నారు. అనంతరం ఒక కేంద్రాన్ని ఏర్పరచుకొని వీరు తమ విధుల్ని నిర్వర్తించనున్నారు.

అధికారుల ప్రయాణ ఖర్చులతో పాటు వసతి, శాంపుల్స్‌ రవాణా ఖర్చులను ఈసారి నాడానే భరించనుంది. వీరితో పాటు మ్యాచ్‌ వేదికల్లో ఉండే స్థానిక డీసీఓలు కూడా శాంపుల్స్‌ సేకరించనున్నారు. ఈ శాంపుల్స్‌ను ఖతర్‌లోని దోహా లాబోరేటరీలో పరీక్షించనున్నారు. ఒక శాంపుల్‌ పరీక్షించినందుకుగానూ నాడా రూ. 26,184 (350 డాలర్లు) చెల్లించనుంది. ఐపీఎల్‌ పాలక మండలి టోర్నీపై తుది ప్రకటన చేస్తే మేం మా ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతామని ‘నాడా’ డైరెక్టర్‌ జనరల్‌ నవీన్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. ‘మిగతా బీసీసీఐ ఈవెంట్లకు చేసినట్లే ఐపీఎల్‌కు కూడా డోప్‌ పరీక్షలు నిర్వహిస్తాం. మ్యాచ్‌ వేదికల్లో మా డీసీఓలు సిద్ధంగా ఉంటారు. మేం యూఏఈకి చెందిన నాడోతో కూడా ఒప్పందం చేసుకున్నాం. ఐపీఎల్‌ పాలక మండలి తుది నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం’ అని ఆయన తెలిపారు. గతంలో ఐపీఎల్‌కు స్వీడన్‌కు చెందిన ఐటీడీఎం సంస్థతో బీసీసీఐ క్రికెటర్లకు డోప్‌ పరీక్షలు నిర్వహించేది. శాంపుల్స్‌ సేకరణ, పరీక్షలు, రవాణా తదితర ఖర్చులన్నీ బీసీసీఐ స్వయంగా భరించింది. నాడా ఆధ్వర్యంలో క్రికెటర్లకు డోప్‌ పరీక్షలు జరగడం ఇదే తొలిసారి.   
 

మరిన్ని వార్తలు