Rafael Nadal-Roger Federer: 'ఇలాంటి రోజు ఎప్పుడు రాకూడదని అనుకున్నా'.. అల్విదా ఫెదరర్‌

16 Sep, 2022 07:24 IST|Sakshi

టెన్నిస్‌లో ఒక శకం ముగిసింది. స్విస్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ ఆటకు వీడ్కోలు పలికాడు. దాదాపు రెండు దశాబ్దాలుగా పైగా ఆటపై చెరగని ముద్ర వేసిన ఫెదరర్‌.. టెన్నిస్‌ ఎంత అందంగా ఆడవచ్చేనది చూపించాడు. సుధీర్ఘమైన కెరీర్‌లో ఘనమైన రికార్డులెన్ని సాధించినా వివాదాలకు దూరంగా ఉండే ‍వ్యక్తి ఫెదరర్‌.  టెన్నిస్‌ ఆటలో అతనికి మిత్రులే కానీ శత్రువులు పెద్దగా లేరు. చిరకాల ప్రత్యర్థులుగా చెప్పుకునే రోజర్‌ ఫెదరర్‌, రాఫెల్‌ నాదల్‌లది విడదీయరాని బంధం.

టెన్నిస్‌ కోర్టు వరకే ఈ ఇద్దరు ప్రత్యర్థులు.. బయట మంచి మిత్రులు. నాదల్‌ కంటే మూడేళ్ల ముందు ఫెదరర్‌ ప్రొఫెషనల్‌గా మారినప్పటికి.. ఈ ఇద్దరు కోర్టులో ఎదురుపడితే కొదమ సింహాల్లా పోరాడేవారు. గెలుపు ఎవరి వైపు ఉందనేది చివరి వరకు చెప్పడం కష్టంగా మారేది. ఇక గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లో నాదల్‌, ఫెదరర్‌ తలపడుతున్నారంటే ఆ మజానే వేరుగా ఉండేది. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో నాదల్‌.. ఫెదరర్‌పై పైచేయి సాధిస్తే.. మిగతా గ్రాండ్‌స్లామ్‌ల్లోనూ ఇరువరి మధ్య పోరు హోరాహోరీగా ఉండేది. 

ఈ ఇద్దరు మొత్తం 48 సార్లు తలపడితే.. నాదల్‌ 24 సార్లు.. ఫెదరర్‌ 16 సార్లు గెలిచాడు. ఇక గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో నాదల్‌ 10 సార్లు విజయం సాధిస్తే.. ఫెదరర్‌ మాత్రం నాలుగుసార్లు గెలుపు రుచి చూశాడు. ఫెదరర్‌ 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ గెలిచాడు.. కానీ అంతకుమించి గెలవాల్సి ఉన్నా అది సాధించకపోవడానికి నాదల్‌ పరోక్ష కారణం. ఫెదరర్‌తో సమంగా నిలిచిన నాదల్‌ తనకు పెట్టిన కోట అయిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్స్‌లో ఫెదరర్‌ను ఎన్నోసార్లు ఓడించాడు. 

ఫెదరర్‌పై నాదల్‌ ఎంత ప్రభావం చూపించాడో.. ఆ తర్వాత వచ్చిన సెర్బియా దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌ కూడా స్విస్‌ దిగ్గజంపై ఆధిక్యం చూపించాడు. ముఖాముఖి పోరులో జొకోవిచ్‌ 27-23తో ఫెదరర్‌పై ఆధిక్యంలో ఉన్నాడు. ఈ ఇద్దరి వల్లే ఫెదరర్‌ 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ దగ్గరే ఆగిపోవాల్సి వచ్చింది. టెన్నిస్‌కు రిటైర్మెంట్‌ ఇచ్చిన ఫెదరర్‌పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు. అయితే టెన్నిస్‌ రాకెట్‌ వదిలేసిన ఫెదరర్‌.. తన చిరకాల మిత్రుడైన రాఫెల్‌ నాదల్‌తో చివరగా ఒక మ్యాచ్‌లో తలపడితే చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. 


ఈ సందర్భంగా స్పెయిన్‌ టెన్నిస్‌ బుల్‌.. నాదల్‌ ఫెదరర్‌ రిటైర్మెంట్‌పై స్పందించాడు. ''నా స్నేహితుడు.. ప్రియమైన ప్రత్యర్థి అయిన రోజర్‌ ఫెదరర్‌.. ఇలాంటి ఒకరోజు ఎప్పుడు రావొద్దని కోరుకున్నా. వ్యక్తిగతంగా నాకు, ప్రపంచవ్యాప్తంగా క్రీడా రంగానికి ఇదో విచారకరమైన రోజు. ఇన్నేళ్లు నీతో గడిపినందుకు ఆనందంగా, గర్వంగా, గౌరవంగా ఉంది. కోర్టు లోపల, బయట ఎన్నో మధురమైన క్షణాలు ఆస్వాదించాం.

భవిష్యత్తులోనూ మరెన్నో క్షణాలను పంచుకుంటాం. కలిసికట్టుగా చేయాల్సిన పనులెన్నో ఉన్నాయని మనకు తెలుసు. ప్రొఫెషనల్‌ క్రీడకు గుడ్‌బై చెప్పిన నువ్వు.. నీ భార్య, పిల్లలు, కుటుంబంతో సంతోషంగా గడపాలని కోరుకుంటున్నా. ఈ జీవితాన్ని ఆస్వాదించు. లండన్‌లో నిన్ను కలుస్తా.. అల్విదా ఫెదరర్‌'' అంటూ పేర్కొన్నాడు. 

చదవండి: రోజర్‌ ఫెడరర్‌ వీడ్కోలు

మరిన్ని వార్తలు