Naina Jaiswal: టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి నైనా జైశ్వాల్‌కు వేధింపులు.. అసభ్యకర మెసేజ్‌లు పంపుతూ..

12 Aug, 2022 15:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి, విద్యావేత్త నైనా జైస్వాల్‌ సోషల్‌ మీడియా నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఓ వ్యక్తి పదే పదే మెసేజ్‌లు చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు నైనా జైస్వాల్‌ తండ్రి అశ్విన్‌ జైస్వాల్‌ హైదరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ సిద్దిపేట జిల్లా చిన్నగుండవెల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్‌ అనే వ్యక్తికి నోటీసులిచ్చారు. పీజీ పూర్తి చేసిన శ్రీకాంత్‌ కొంతకాలంగా మానసిక ఒత్తిడితో బాధపడుతున్నాడు. 

కొన్ని నెలల క్రితం నైన జైస్వాల్‌కు ఇన్‌స్ట్రాగా­మ్‌లో మెసేజ్‌లు చేశా­డు. ఆ మెసేజ్‌లు కాస్త ఇబ్బందికరంగా ఉండటంతో ఆమె శ్రీకాంత్‌ను బ్లాక్‌ లిస్టులో పెట్టారు. ఆ తర్వాత పలు పేర్లతో ఫేక్‌ ఖాతాలు సృష్టించి నైనా పోస్ట్‌ చేసిన పోస్టులకు అసభ్య కామెంట్లు పెడుతున్నాడు. దీనిపై అప్పట్లో తండ్రి అశ్విన్‌జైస్వాల్‌ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు సిద్దిపేట రూరల్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. శ్రీకాంత్, అతని తండ్రిని, సోదరుడిని పిలిచిన పోలీసులు రెండు పర్యాయాలు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపారు. 

ఆ తర్వాత ట్విట్టర్‌ అకౌంట్స్‌ సుమారు 30–50 క్రియేట్‌ చేసి కామెంట్‌ చేస్తున్నాడు. ఈ వ్యాఖ్యలు కాస్త ఇబ్బందికరంగా ఉండటంతో మరోమారు సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి శ్రీకాంత్‌ అరెస్టు చేసినట్టు ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు.  

టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌గా పలు జాతీయ, అంతర్జాతీయ టైటిళ్లు సాధించిన నైనా.. చదువుల తల్లిగానూ పేరొందింది. 8 ఏళ్లకే పదో తరగతి పూర్తి చేసిన ఆమె.. 13 ఏళ్లకే గ్రాడ్యుయేషన్‌, 15 ఏళ్లకు మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేసింది. తద్వారా ఆసియాలోనే పిన్న వయసులో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కంప్లీట్‌ చేసిన ఘనత దక్కించుకుంది. మోటివేషనల్‌ స్పీకర్‌గానూ రాణిస్తున్న నైనా జైశ్వాల్‌ ఇటీవలే తన తల్లి భాగ్యలక్ష్మితో కలిసి ఎల్‌ఎల్‌బీలో చేరగా.. ఫస్ట్‌క్లాస్‌లో పాసైంది.

చదవండి: Chess Olympiad 2022: 9 నెలల గర్భంతో కాంస్య పతకం.. శభాష్‌ అంటున్న క్రీడాలోకం

మరిన్ని వార్తలు