RSWS 2022: చెలరేగిన నమన్‌ ఓజా, ఇర్ఫాన్‌ పఠాన్‌.. ఫైనల్లో ఇండియా లెజెండ్స్‌

29 Sep, 2022 18:02 IST|Sakshi

రోడ్‌సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ 2022లో ఇండియా లెజెండ్స్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. ఆస్ట్రేలియా లెజెండ్స్‌తో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్‌ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇండియా లెజెండ్స్‌ ఓపెనర్‌ నమన్‌ ఓజా (90 పరుగులు నాటౌట్‌) విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడగా.. ఆఖర్లో ఇర్ఫాన్‌ పఠాన్‌ (37 పరుగులు నాటౌట్‌) మెరుపులు మెరిపించాడు. 

వాస్తవానికి బుధవారమే ఈ మ్యాచ్‌ పూర్తవ్వాల్సింది. కానీ ఆస్ట్రేలియా లెజెండ్స్‌ ఇన్నింగ్స్‌ సమయంలో వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగింది. వర్షం ఎంతకు తెరిపినివ్వకపోవడంతో ఆటను గురువారం కూడా కంటిన్యూ చేశారు. బుధవారం వర్షం అంతరాయం కలిగించే సమయానికి 17 ఓవర్లలో ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. కాగా గురువారం ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆస్ట్రేలియా మరో 3 ఓవర్లు ఆడింది. మొత్తం 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. బెన్‌ డక్‌ 46 పరుగులతో టాప్‌ స్కోరర్‌ కాగా.. చివర్లో కామెరున్‌ వైట్‌ 30, బ్రాడ్‌ హడిన్‌ 12 పరుగులు చేశారు.

అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా లెజెండ్స్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. 10 పరుగులు చేసిన టెండూల్కర్‌ రీయర్డన్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన సురేశ్‌ రైనా(11) కూడా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో యువరాజ్‌ సింగ్‌(18)తో కలిసి నమన్‌ ఓజా(62 బంతుల్లో 90 నాటౌట్‌, 7 ఫోర్లు, 5 సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను నడిపించాడు. యువీ, బిన్నీ, యూసఫ్‌ పఠాన్‌లు వెనుదిరగడంతో ఇండియా లెజెండ్స్‌ కష్టాల్లో పడింది.

ఈ దశలో క్రీజులోకి వచ్చిన ఇర్ఫాన్‌ పఠాన్‌( 12 బంతుల్లో 37 నాటౌట్‌, 2 ఫోర్లు) మెరుపులు మెరిపించగా.. నమన్‌ ఓజా చెలరేగాడు. 10 పరుగుల దూరంలో సెంచరీ దూరమైనప్పటికి నమన్‌ ఓజా మాత్రం ఆకట్టుకున్నాడు. ఈ ఇద్దరు మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడి 19.2 ఓవర్లలో జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇక శ్రీలంక లెజెండ్స్‌, వెస్టిండీస్‌ లెజెండ్స్‌ మధ్య సెమీఫైనల్‌-2 మ్యాచ్‌ విజేతతో ఇండియా లెజెండ్స్‌ ఫైనల్‌ ఆడనుంది. ఇక ఫైనల్‌ మ్యాచ్‌ అక్టోబర్‌ 1న(శనివారం) జరగనుంది.

చదవండి: సెంచరీతో చెలరేగిన విండీస్‌ హిట్టర్‌.. ఫైనల్లో జమైకా తలైవాస్‌

సురేష్‌ రైనా స్టన్నింగ్‌ క్యాచ్‌.. చూసి తీరాల్సిందే!

మరిన్ని వార్తలు