ఫ్రెంచ్‌ ఓపెన్‌కు ఒసాకా దూరం 

19 Sep, 2020 02:35 IST|Sakshi

పారిస్‌: గతవారమే యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను రెండోసారి నెగ్గిన జపాన్‌ యువతార, ప్రపంచ మూడో ర్యాంకర్‌ నయోమి ఒసాకా... ఈనెల 27 నుంచి మొదలయ్యే ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ నుంచి వైదొలిగింది. ఎడమ తొడ కండరాల గాయం కారణంగా ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. ‘ఈసారి నేను ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఆడటంలేదు. తొడ కండరాల గాయం ఇంకా తగ్గలేదు. ఈ మెగా టోర్నీకి నిర్ణీత సమయంలోపు సిద్ధం కాలేను’ అని ఒసాకా ట్విట్టర్‌లో ప్రకటించింది. ఫలితంగా ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి దూరమైన రెండో స్టార్‌గా ఒసాకా నిలిచింది. కరోనా వైరస్‌ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి మహిళల సింగిల్స్‌ డిఫెండింగ్‌ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్‌ యాష్లే బార్టీ తప్పుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఫ్రాన్స్‌లో కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఫ్రెంచ్‌ ఓపెన్‌ను వీక్షించేందుకు వచ్చే ప్రేక్షకుల సంఖ్యను నిర్వాహకులు కుదించారు. గతంలో రోజుకు 11,500 మంది ప్రేక్షకులను అనుమతించాలని భావించినా నిర్వాహకులు ఇప్పుడు ఆ సంఖ్యను 5000 పరిమితం చేయనున్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు