National Games: అంగరంగ వైభవంగా 36వ జాతీయ క్రీడల వేడుకలు

29 Sep, 2022 21:40 IST|Sakshi

36వ జాతీయ క్రీడా ప్రారంభోత్సవ వేడుకలు గురువారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ టార్చ్‌ను వెలిగించి క్రీడలను ప్రారంభించారు. అనంతరం జాతీయ క్రీడలనుద్దేశించి ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు, జావెలిన్‌ స్టార్‌ నీరజ్‌ చోప్రా, రెజ్లర్‌ రవికుమార్‌ దహియాలు పాల్గొన్నారు. అక్టోబర్‌ 10 వరకు జరిగే ఈ క్రీడల్లో 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలతోపాటు భారత త్రివిధ దళాలకు చెందిన సర్వీసెస్‌ జట్టు నుంచి మొత్తం ఏడువేల మంది క్రీడాకారులు పోటీపడనున్నారు.

మొత్తం 36 ఈవెంట్స్‌లో పతకాల కోసం పోటీలుంటాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, వడోదర, రాజ్‌కోట్, భావ్‌నగర్‌ నగరాల్లో మ్యాచ్‌లను ఏర్పాటు చేశారు. చివరిసారి 2015లో జరిగిన జాతీయ క్రీడలకు కేరళ ఆతిథ్యమిచ్చింది. ఆ క్రీడల్లో తెలంగాణ 8 స్వర్ణాలు, 14 రజతాలు, 11 కాంస్యాలతో కలిపి 33 పతకాలతో 12వ ర్యాంక్‌లో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌ 6 స్వర్ణాలు, 3 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి 16 పతకాలతో 18వ స్థానంలో నిలిచింది.

మరిన్ని వార్తలు