మిథాలీ, పీవీ సింధులపై ప్రధాని మోదీ ప్రశంసలు

28 Mar, 2021 13:36 IST|Sakshi

ఢిల్లీ: భార‌త మ‌హిళా క్రికెట‌ర్ మిథాలీరాజ్‌, బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి పీవీ సింధుపై ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ ప్ర‌శంస‌లు కురిపించారు. మార్చి 8న ఘ‌నంగా మ‌హిళా దినోత్స‌వం జ‌రుపుకున్నామ‌ని, ఇదే నెల‌లో చాలామంది భార‌త మ‌హిళా క్రిడాకారిణిలు త‌మ పేరిట స‌రికొత్త‌ రికార్డులు న‌మోదు చేయ‌డం సంతోష‌క‌ర‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు. మ‌న్ కీ బాత్ 75వ ఎపిసోడ్‌లో భాగంగా ఆదివారం ఆలిండియా రేడియోలో జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు.

ఈ సందర్భంగా దేశంలో విజేత‌లుగా నిలిచిన ప‌లువురు మ‌హిళ‌ల గురించి ప్ర‌స్తావించారు. మహిళా క్రికెట్ చ‌రిత్ర‌లో 10 వేల ప‌రుగుల‌ మైలురాయిని దాటిన తొలి భార‌త క్రీడాకారిణిగా మిథాలీ రాజ్ నిలిచార‌ని, ఆమె సాధించిన విజయానికి తాను అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నానని ప్ర‌ధాని చెప్పారు. అదేవిధంగా పీవీ సింధు గురించి కూడా ప్ర‌ధాని మోదీ ప్ర‌స్తావించారు. సింధు అద్భుత‌మైన క్రీడా ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో అనేక అవార్డులు అందుకున్నారని ప్ర‌ధాని గుర్తుచేశారు. మిథాలీ, సింధు ఇద్ద‌రూ భ‌విష్య‌త్ త‌రాల‌కు స్ఫూర్తిగా నిలిచార‌ని ఆయ‌న కొనియాడారు. ఢిల్లీలో జ‌రిగిన ఐఎస్ఎస్ఎఫ్ వ‌ర‌ల్డ్ క‌ప్ షూటింగ్‌లోనూ మ‌హిళలు ప‌తకాల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో నిలిచార‌ని, బంగారు ప‌తకాల జాబితాలోనూ భార‌త్ ముందంజ‌లో ఉన్న‌ద‌ని ప్ర‌ధాని తెలిపారు.

జనతా కర్య్ఫూ ప్రపంచానికి సూర్తి:
ప్రధాని మోదీ 75వ మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో భాగంగా మోదీ ఏడాది పూర్తి చేసుకున్న జనతా కర్ఫ్యూపై కీలక వ్యాఖ్యలు చేశారు. జనతా కర్య్ఫూ సందర్భంగా ప్రజలు చూపించిన క్రమశిక్షణ.. యావత్‌ ప్రపంచానికే ప్రేరణగా నిలిచిందన్నారు. దేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. కు‌రువృద్ధులు కూడా వ్యాక్సిన్ తీసుకోవ‌డానికి ఉత్సాహంగా ముందుకు వ‌స్తున్నార‌ని ప్ర‌ధాని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో జయ్ చౌదరీ అనే వందేండ్ల‌ వృద్ధుడు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాడ‌ని, యూపీలో 109 ఏండ్ల రామ్ దుల‌య్యా, ఢిల్లీలో 107 ఏండ్ల కేవ‌ల్ కృష్ణ క‌రోనా క‌రోనా టీకా వేయించుకున్నార‌ని ప్ర‌ధాని చెప్పారు.
చదవండి:
25 పతకాలతో టాప్‌లో..
చీఫ్‌ సెలెక్టర్‌ అయి ఉంటే.. అతన్ని తీసుకొచ్చేవాడిని

మరిన్ని వార్తలు