నరైన్‌ యాక్షన్‌పై కేకేఆర్‌ సీరియస్‌ లుక్‌! 

15 Oct, 2020 17:45 IST|Sakshi

అబుదాబి: ప్రస్తుత ఐపీఎల్‌లో కేకేఆర్‌ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ బౌలింగ్‌పై మరోసారి సందేహాలు రావడంతో ఒక మ్యాచ్‌కు దూరమయ్యాడు. కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో నరైన్‌ బౌలింగ్‌ యాక్షన్‌పై సందేహాలు వచ్చాయి.  దీనిపై మ్యాచ్‌ తర్వాత అంపైర్లు.. నరైన్‌ యాక్షన్‌పై అనుమానం వ్యక్తం చేశారు. అటు తర్వాత ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌కు నరైన్‌ దూరమయ్యాడు. ఇక్కడ నరైన్‌పై ఎటువంటి నిషేధం విధించకపోయినా కేకేఆర్‌ ముందస్తు వ్యూహంతో నరైన్‌ను ఆ మ్యాచ్‌లో ఆడించలేదు. కాగా, రేపు(గురువారం) ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో నరైన్‌ ఆడటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. (బిషప్‌ టీమ్‌లో ఏడుగురు భారత క్రికెటర్లు..!)

కీలక బౌలర్‌ అయిన నరైన్‌ బౌలింగ్‌ యాక్షన్‌ నిజంగానే నిబంధనల్ని అతిక్రమించి ఉంటే అతను శాశ్వతంగా ఈ ఐపీఎల్‌ సీజన్‌కు దూరమవుతాడు. దాంతో అతని బౌలింగ్‌ యాక్షన్‌ సరిచేసే పనిలో పడింది కేకేఆర్‌ ఫ్రాంచైజీ. ఈ మిస్టరీ స్పిన్నర్‌ కేకేఆర్‌ జట్టులో కీలక ఆటగాడు కావడంతో సీరియస్‌గా దృష్టిసారించారు. ఈ క్రమంలోనే ఆ జట్టు స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌ కార్ల్‌ క్రో.. నరైన్‌ యాక్షన్‌ను సరిచేయడానికి నడుంబిగించారు. కొన్ని రోజులుగా నరైన్‌ చేత నెట్స్‌లో విపరీతంగా ప్రాక్టీస్‌ చేయిస్తున్నాడు. అసలు విరామం లేకుండా నరైన్‌ బౌలింగ్‌ యాక్షన్‌ను పరిశీలిస్తున్నారు. కీలక బౌలర్‌ అయిన నరైన్‌ను  సాధ్యమైనంత తొందరగా రంగంలోకి దింపడమే పనిగా పెట్టుకుంది కేకేఆర్‌.

2014-15 సీజన్‌లో నరైన్‌ బౌలింగ్‌ యాక్షన్‌పై ఫిర్యాదులు వచ్చినప్పుడు కూడా అతనితో కలిసి కార్ల్‌ క్రో పనిచేశాడు. ఇప్పుడు మరొకసారి అతని బౌలింగ్‌పై అనుమానాలు రావడంతో నరైన్‌ అత్యధిక సమయం నెట్స్‌లోనే గడుపుతున్నాడు. డేటా ఎనాలిస్ట్‌ల సాయంతో నరైన్‌ బౌలింగ్‌లోని కొన్ని ప్రధాన కోణాల్ని పరిశీలిస్తున్నారు. దాంతో ముంబైతో మ్యాచ్‌లో నరైన్‌ ఆడటం అనుమానమే. ఒకవేళ ఆడి మళ్లీ బౌలింగ్‌ యాక్షన్‌పై సందేహాలు వస్తే మాత్రం అప్పుడు వివాదం మరింత పెద్దది కావొచ్చు. ఏమైనా లోపాలు ఉంటే సరిచేసుకుని బరిలోకి దిగితేనే మంచిదనే వ్యూహంతో కేకేఆర్‌ ముందుకు వెళుతుంది. ఈ సీజన్‌లో నరైన్‌ బౌలింగ్‌ వేసిన గత వీడియోలను కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు. 

2012 నుంచి ఇప్పటివరకూ సునీల్‌ నరైన్‌ 115 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడాడు. అయితే నరైన్‌ బౌలింగ్‌పై 2015 చివరిసారి ఫిర్యాదు అందిన తర్వాత బౌలింగ్‌ యాక్షన్‌ సరిచేసుకుని మళ్లీ క్రికెట్‌ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టాడు. అప్పట్నుంచి ఇప్పటివరకూ 68 ఐపీఎల్‌ గేమ్‌లను నరైన్‌ ఆడాడు.  2014లో జరిగిన ఛాంపియన్స్‌ లీగ్‌లో రెండు సార్లు అతడిపై ఫిర్యాదులు వచ్చాయి. తన బౌలింగ్‌ కారణంగా 2015లో జరిగిన ప్రపంచ కప్‌కు దూరమయ్యాడు. 

మరిన్ని వార్తలు