Body Shaming Azam Khan: షేమ్‌, షేమ్‌ నసీం షా.. షేమ్‌, షేమ్‌ పాకిస్తాన్‌

2 Feb, 2023 16:49 IST|Sakshi

Naseem Shah-Azam Khan: పాకస్తాన్‌ క్రికెటర్‌, ఆ జట్టు యువ పేసర్‌ నసీం షా తమ దేశ క్రికెటర్లకు మాత్రమే సాధ్యమయ్యే ఓవరాక్షన్‌ చేసి పరువు పోగొట్టుకున్నాడు. నసీం.. లాపుగా ఉన్న సహచర సభ్యుడు, పాక్‌ దిగ్గజ వికెట్‌కీపర్‌ మొయిన్‌ ఖాన్‌ తనయుడు ఆజం ఖాన్‌తో అసభ్యంగా ప్రవర్తించాడు. బాడీ షేమింగ్‌ చేస్తూ ఎగతాళి చేయడమే కాకుండా, అతన్ని ఢీకొట్టాడు. తమ దేశ​ క్రికెటర్‌తో పరాయి గడ్డపై అభ్యంతరకరంగా ప్రవర్తించి, తనతో పాటు తన దేశ పరువునూ బజారుకీడ్చాడు.

ఈ ఘటన బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2023 సీజన్‌లో చోటు చేసుకుంది. ఈ లీగ్‌లో వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఈ ఇద్దరు క్రికెటర్లు మైదానంలో ఎదురెదురు పడిన సందర్భంలో ఆజం శరీరాన్ని నసీం అవహేళన చేశాడు. ఆజం బ్యాటింగ్‌ చేసేందుకు మైదానంలోకి వస్తుండగా నసీం ఎదురెళ్లి అతని శరీర తత్వాన్ని వెక్కిరిస్తూ, అతనిలా నడుస్తున్నట్లు ఇమిటేట్‌ చేశాడు. ఇంతటితో ఆగకుండా ఆజంను ఢీకొట్టి, అతని శరీరంపై వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేశాడు.

అయితే ఇవేవి పట్టించుకోని ఆజం ఖాన్‌, నసీంను నెట్టేసి క్రీజ్‌వైపు వెళ్లాడు. వెళ్తున్నప్పుడు కూడా నసీం ఓవరాక్షన్‌ అలాగే కొనసాగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవగా, నెటిజన్లు ఆ దేశం, ఈ దేశం అన్న తేడా లేకుండా నసీం షాను వాయించేస్తున్నారు. తమ వాడితో ఇలా ప్రవర్తించావు కాబట్టి సరిపోయింది, పరాయి దేశస్తుడితో ఇలా ప్రవర్తించి ఉంటే నీకు కచ్చితంగా దేహశుద్ధి అయ్యేది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏ దేశస్తుడైనా బాడీ షేమింగ్‌ చేయడం కరెక్ట్‌ కాదని మరికొందరు నసీంకు చురకలంటిస్తున్నారు. ఇంకొందరైతే.. షేమ్‌, షేమ్‌ నసీం షా.. షేమ్‌, షేమ్‌ పాకిస్తాన్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే, ఈ ఘటన జరిగిన మ్యాచ్‌లో ఖుల్నా టైగర్స్‌ తరఫున ఆజం ఖాన్‌, కొమిల్లా విక్టోరియన్స్‌ తరఫున నసీం షా బరిలో​కి దిగారు. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో కొమిల్లా విక్టోరియన్స్‌ ఘన విజయం సాధించింది. విండీస్‌ వీరుడు జాన్సన్‌ చార్లెస్‌ 56 బంతుల్లో 5 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో అజేయమైన 107 పరుగులు చేసి కొమిల్లా విక్టోరియన్స్‌  చారిత్రక విజయాన్ని అందించాడు.  

మరిన్ని వార్తలు