Joe Root: రూట్‌ ఒక్కడు ఆడితే సరిపోదు.. ఇలా అయితే కష్టం

18 Aug, 2021 12:27 IST|Sakshi

లార్డ్స్‌: టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్‌ ఓటమికి బ్యాటింగ్‌ వైఫల్యమే కారణమని అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇందుకు తగ్గట్టుగానే రెండో టెస్టులో జో రూట్‌ మినహా మిగతా వారెవరు చెప్పుకోదగ్గ స్కోరు నమోదు చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ ఓటమిపై ఆ జట్టు మాజీ ఆటగాడు నాసిర్‌ హుస్సేన్‌ స్పందించాడు. 

''లార్డ్స్‌లో ఇంగ్లండ్‌ ఆటతీరు బాగానే  అనిపించినప్పటికి కెప్టెన్‌ రూట్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నట్లు కనిపిస్తుంది. ఇంగ్లండ్‌ టాపార్డర్‌లో బలహీనంగా తయారైంది. ఓపెనర్లు సిబ్లీ, బర్న్స్‌, హసీబ్‌ హమీద్‌లు తమ స్థాయికి తగ్గట్టు ఆడలేకపోతున్నారు. రెండో టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనరిద్దరు డకౌట్‌గా వెనుదిరగడం విశేషం. అంతేగాక వన్‌డౌన్‌లో ఆడుతున్న హమీద్‌ తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 9 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక మిడిలార్డర్‌లో బెయిర్‌ స్టో ఫామ్‌లో ఉ‍న్నట్లే కనిపించినా.. జాస్‌ బట్లర్‌, మొయిన్‌ అలీలు నిరాశపరిచారు.

ఇదిలాగే కొనసాగితే రానున్న టెస్టుల్లో ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక బౌలింగ్‌ విభాగం పటిష్టంగా కనిపిస్తున్నప్పటికి గాయాలు జట్టును వేధిస్తున్నాయి. రెండో టెస్టులో బౌలింగ్‌తో ఆకట్టుకున్న మార్క్‌వుడ్‌ గాయం బారీన పడినట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌కు ఇప్పుడు బ్యాకప్‌ ఆటగాళ్ల అవసరం చాలా ఉంది. ఇక రెండో టెస్టులో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. విరాట్‌ కోహ్లి కెప్టెన్సీ... బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ ఇలా అన్ని విభాగాల్లో అదరగొట్టిన టీమిండియా మంచి విజయాన్ని దక్కించుకుంది. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో షమీ, బుమ్రాలు చూపిన తెగువ మ్యాచ్‌ విజయానికి బాటల పరిచింది.'' అంటూ చెప్పుకొచ్చాడు.

మరిన్ని వార్తలు