Nasser Hussain: 'ఇలాగే కొనసాగితే.. ఆటగాళ్లకు పిచ్చెక్కడం ఖాయం'

19 Jul, 2022 17:04 IST|Sakshi

ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ నాసర్‌ హుస్సేన్‌ ఐసీసీ చేపట్టనున్న ప్యూచర్‌ టూర్‌ ప్రోగ్రామ్-ఎఫ్‌టీపీ‌(2020-23)పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎఫ్‌టీపీ పేరుతో ఐసీసీ ప్లాన్‌ చేసిన బిజీ షెడ్యూల్‌ పెద్ద జోక్‌లా ఉందని.. ఇది ఇలాగే కొనసాగితే ఆటగాళ్లకు పిచ్చెక్కి ఒక్కొక్కరుగా దూరమవుతారంటూ పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌ స్టార్‌ క్రికెటర్‌ బెన్‌ స్టోక్స్‌ అనూహ్య రిటైర్మెంట్‌ కూడా ఇదే సూచిస్తుందని తెలిపాడు. స్పోర్ట్స్‌ స్టార్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో నాసర్‌ హుస్సేన్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. 

''31 ఏళ్లకే వన్డేల నుంచి తప్పుకొని బెన్‌ స్టోక్స్‌ పెద్ద షాక్‌ ఇచ్చాడు. మరో మూడు, నాలుగేళ్లు అన్ని ఫార్మాట్స్‌లో ఆడే సత్తా స్టోక్స్‌కు ఉన్నప్పటికి ఒత్తిడి మూలంగా వన్డేలకు గుడ్‌బై చెప్పాల్సి వచ్చింది. మూడు ఫార్మాట్లలో ఉన్న బిజీ షెడ్యూల్‌ వల్ల తాను అధిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని స్వయంగా స్టోక్స్‌ చెప్పుకొచ్చాడు. మూడేళ్ల క్రితం వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో కీలక ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌ను విశ్వవిజేతగా నిలిపిన స్టోక్స్‌ వన్డే కెరీర్‌ ఇలా అర్థంతరంగా ముగుస్తుందని నేను ఊహించలేదు.

దీనికి ప్రధాన కారణం ఐసీసీ. అర్థం పర్థం లేని ప్యూచర్‌ టూర్‌ ప్రోగ్రామ్‌ లాంటి కార్యక్రమాలతో ఐసీసీ ఆటగాళ్లను మానసిక ప్రశాంతత కరువవ్వడానికి పరోక్షంగా సహాయపడినట్లవుతుంది. సిరీస్‌కు- సిరీస్‌కు గ్యాప్‌ లేకుండా బిజీ షెడ్యూల్‌తో ఆటగాళ్లపై ఒత్తిడి పడడం ఖాయమని.. త్వరలోనే చాలా మంది ఆటగాళ్లు ఒత్తిడి తట్టుకోలేక వన్డే ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఎఫ్‌టీపీ లాంటి కార్యక్రమాలతో వన్డే ఫార్మాట్‌లో భవిష్యత్తులో మరిన్ని సమస్యలు రానున్నాయి. వాటి పరిణామాలు ఎదుర్కొనేందుకు ఐసీసీ సిద్ధంగా ఉండాలి'' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక ఐపీఎల్‌ రెండు నెలల​ విండోకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన ఐసీసీ ఎఫ్‌టీపీ(ఫ్యూచర్‌ టూర్‌ ప్రోగ్రామ్‌) పేరుతో కొత్త షెడ్యూల్‌ను డిజైన్‌ చేసింది. ఎఫ్‌టీపీలో భాగంగా రానున్న కాలంలో జరగనున్న మ్యాచ్‌లకు సంబంధించిన క్యాలెండర్‌ను ఇప్పటికే రూపొందించింది. దీంతో అన్ని జట్లు బిజీ షెడ్యూల్‌లో గడపనున్నాయి. సిరీస్‌ ముగిసిన తర్వాత సరదాగా గడిపే సమయం కూడా లేకుండా క్రికెట్‌ సిరీస్‌లతో బిజీ కానున్నాయి.

చదవండి: Ben Stokes: వన్డే క్రికెట్‌కు స్టోక్స్‌ గుడ్‌బై.. కారణాలు ఇవేనా..?

Graeme Smith: కీలక పదవి చేపట్టనున్న సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్‌

మరిన్ని వార్తలు